సీనియర్ నేత , మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..? ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా..? ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయానికి వచ్చారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
ఏపీ రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావు తెలియని వారు ఎవరూ ఉండరు. సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ధర్మాన మొన్నటి ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు. రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు..ఓ సర్పంచ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అది కూడా యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆయన చరిష్మాను పలుచన అయ్యేలా చేసింది.
Also Read : లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి..ఏంటి ప్రత్యేకతలు !
కూటమి వేవ్ లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా…ఆయన మాత్రం తన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన తర్వాత ధర్మాన జూలు విదుల్చుతారని అనుకున్నా ఆయన మాత్రం సైలెంట్ మోడ్ నుంచి బయటకు రావడం లేదు. పైగా.. మొన్నటి ఎన్నికల్లో తనకు కాకుండా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని జగన్ ను అభ్యర్థించారు.. కానీ జగన్ నిరాకరించడంతో ప్రసాదరావు పోటీ చేశారు.
ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఓ సర్పంచ్ చేతిలో ఓడిపోవడంతో ధర్మాన ప్రసాదరావు ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు ఆయన సన్నిహితులు, పార్టీ నేతలతోపాటు ధర్మాన కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవేళ ధర్మాన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా అధికారిక ప్రకటన చేస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఓ కీలక నేత రాజకీయానికి తెరపడినట్లే అవుతుంది.