ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి కొమ్ముకాసే మీడియా ఏదనేది అందరికీ తెలిసిందే! ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఈ రెండూ అప్రకటితంగా టీడీపీ అజెండాను వారే భుజానికి ఎత్తేసుకుంటాయి. పార్టీ మనసు అర్థం చేసుకుని, భవిష్యత్తుకు బాధ్యత వహిస్తూ ప్రజలను నెమ్మదిగా ప్రిపేర్ చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో కూడా అలాంటి ఓ కొత్త ప్రిపరేషనే తెర వెనక మొదలైందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో అధికార పార్టీకి కొమ్ము కాసే ఆ మీడియా సంస్థలకి భారతీయ జనతా పార్టీ కూడా అభిమాన పక్షమే. ఎందుకంటే, టీడీపీకి మిత్రపక్షం కాబట్టి! సో.. కేంద్రం పనితీరు అద్భుతం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం అమోఘం అంటూ వేనోళ్ల కీర్తించిన నోళ్లే.. ఇప్పుడు మెల్లగా గొంతు సవరించించుకుంటున్న పరిస్థితి వచ్చింది! ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేస్తోందనే విషయం హఠాత్తుగా ఆంధ్రజ్యోతికి గుర్తు వచ్చేసింది. ఆంధ్రాకి భాజపా సర్కారు ఎంత అన్యాయం చేసేస్తోందో ఓ కథనం వండివార్చింది.
రాజధాని లేదు, ఆర్థిక లోటు తీరలేదు, పరిశ్రమలు లేవు, పథకాలకు నిధులు సరిపోవడం లేదంటూ కొన్ని గణాంకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేంద్రం 44 పథకాలు అమలు చేస్తుంటే, వాటిలో 24 పథకాల విషయంలో ఆంధ్రాకి తీవ్రమైన అన్యాయం జరిగిపోతోందని సదరు కథనంలో వాపోయారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రూ. 78 వేల కోట్లు నిధులు విడుదల చేశారనీ, వాటిలో ఆంధ్రాకి వచ్చినవి కేవలం రూ. 18 వందల కోట్లు మాత్రమే అంటూ లెక్కలు చెప్పారు. అంతేకాదు, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాదిపైనే భాజపాకి ప్రేమ ఎక్కువ అనేది ఎస్టాబ్లిస్ చేయడం గమనార్హం. భాజపా పాలిత రాష్ట్రాలకే అత్యధిక మొత్తంలో కేంద్రం నిధులు అందుతున్నాయని రాశారు. స్మార్ట్ సిటీలు, సర్వశిక్ష అభియాన్, అమృత్ పథకం, గ్రీన్ ఇండియా.. ఇలా కేంద్ర ప్రాయోజిత పథకాలవారీగా ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, కాదుకాదు.. ఏపీకి భాజపా చేస్తున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
ఇక, ఈనాడు విషయానికొస్తే.. మూడు రోజుల కిందట ‘ఉపాధికి దెబ్బ’ అంటూ ఓ కథనం రాశారు. ఉపాధి కూలీలకు వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోవడానికి కారణం కేంద్రం తీరే అని దాన్లో సవివరంగా చెప్పారు. ప్రతిపక్ష వైకాపా నేతల ఫిర్యాదుల వల్లనే కూలీల నిధుల విడుదల ఆగిపోయాయని అధికార పార్టీ ఈమధ్య చెబుతూనే ఉంది. కానీ, ఆ చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్దుబాటు చెయ్యొచ్చు, కేంద్రం ఇచ్చేలోగా రాష్ట్రమే ఇవ్వొచ్చు అనే ఆలోచన రానీయకుండా నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేశారు. ఇక, పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో కూడా కేంద్ర సాయం సరిపోదన్నట్టుగా ఈ మధ్య కథనాలు ఇస్తున్నారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందడం లేదనే కోణంలో భాజపా తీరును నెమ్మదిగా తప్పుబట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఆంధ్రాకు రావాల్సిన నిధులూ పథకాల గురించి ప్రశ్నించడం మంచిదే. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడాన్నీ ఎవ్వరూ తప్పబట్టరు. కాకపోతే… ఇంత అన్యాయం జరుగుతోందనే విషయం ఇప్పుడు గుర్తించారా అనేదే ప్రశ్న..? కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా నిధులు రావట్లేదని ఈ మధ్యనే తెలిసిందా..? నిన్న మొన్నటి వరకూ మోడీ నాయకత్వం సూపరో సూపరు అంటూ కథనాలు వండి వార్చేసి… ఇప్పుడు ఆంధ్రాకు చాలా అన్యాయం జరిగిపోతోంది ఒకేసారి గొంతు మార్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? అంటే, రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు! మొదటిది… పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు తరువాత మోడీ సర్కారుపై ప్రజాగ్రహం వ్యక్తమౌతోంది. అది కేంద్రాన్ని కూడా తాకింది కాబట్టే, ఈ మధ్య ఉద్దీపనాలూ ప్రోత్సాహకాలు అంటూ మోడీ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి తాకకుండా కాపాడాల్సిన గురుతర బాధ్యతను భుజాన వేసుకోవాల్సింది వారేగా! ఇక, రెండోది… కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో చంద్రబాబు సర్కారు వైఫల్యం కూడా ఉంటుంది కదా! దాన్ని ప్రజలు గుర్తించే లోపు… ఇది చంద్రబాబు వైఫల్యం కాదు, భాజపా చిన్నచూపు అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సింది కూడా వారే కదా! అందుకే, సదరు మీడియా స్వరం ఇలా మారుతోందని చెప్పుకోవచ్చు.