తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా బీజేపీ సీనియర్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయని అంటున్నాయి రాజకీయ వర్గాలు.
తెలంగాణలో ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని ఆ మధ్య వ్యాఖ్యానించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆగస్ట్ సంక్షోభం తప్పదని వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సంక్షోభం తప్పదని హెచ్చరించడం కొత్త చర్చకు తెరలేపింది.
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను ఇప్పటికప్పుడు అమలు చేసే అవకాశం లేదు. అయినా, అన్ని హామీలు ఆగస్ట్ లోపు నెరవేర్చాలని లేదంటే సంక్షోభం ఖాయమని లక్ష్మణ్ వ్యాఖ్యానించడం చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ను కమలనాథులు కూల్చడం ఖాయమన్న ప్రచారం మరోసారి విస్తృతంగా సాగుతోంది.
తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకొని, మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ సర్కార్ ను పక్కా కూల్చుతారనే విశ్లేషణల నేపథ్యంలో లక్ష్మణ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ పెద్దల ఆలోచన మేరకే ఆగస్ట్ సంక్షోభం తప్పదని లక్ష్మణ్ కామెంట్స్ చేశారా..? మరేదేమైనా కారణమా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.