వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఎన్నికల ప్రకటన నేడో .. రేపో రాబోతున్న సమయంలో.. ఆయన లండన్ పర్యటనకు వెళ్లారు. మరి పార్టీ కార్యక్రమాలను ఎవరు చేపడుతున్నారు..? టిక్కెట్ల కసరత్తు సంగతేమిటి..? అసంతృప్తుల బుజ్జగింపుల సంగతేమిటి..?. ఇవన్నీ ఆయన .. ప్రశాంత్ కిషోర్ బృందానికి ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పేరుకు మాత్రమే అధ్యక్షుడు… అసలు వ్యవహారాలన్నీ… ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కంపెనీ నిర్వహిస్తోంది.
హవ్వ.. అభ్యర్థుల ఎంపిక కన్సల్టెన్సీకి ఇస్తారా..?
ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ… ఐప్యాక్.. ప్రశాంత్ కిషోర్ అనబడే ఓ వ్యక్తికి చెందిన కంపెనీ ఇది. గత ఎన్నికలకు ముందు… భారతీయ జనతా పార్టీకి వ్యూహరచన చేశారన్న పేరు రావడంతో.. ఆయనకు.. చాలా పార్టీలు క్లైంట్లుగా మారాయి. అలా క్లైంట్లుగా మారిన ఓ పార్టీకి ఆయన ఇప్పుడు ఉపాధ్యక్షుడు అయిపోయి… తానే వారసుడ్నిగా ప్రకటించుకోవడం తర్వాతి విషయం. కానీ.. ఆయన పెట్టిన కంపెనీల క్లైంట్ల జాబితాలో.. వైసీపీ కూడా చేరింది. ఫీజు వందల కోట్లు అని ప్రచారం జరుగుతోంది కానీ.. ఎంత అన్న విషయం క్లారిటీ లేదు. కానీ.. వందల మందిని నియమించుకుని ఆ సంస్థ వైసీపీ కోసం చేస్తున్న సర్వేలు… అభ్యర్థుల ఎంపిక వ్యవహారం పర్యవేక్షణ.. చివరికి బుజ్జగింపులు కూడా.. ఆ పీకే కంపెనీనే చూస్తూండటంతో.. అంత కంటే..ఎక్కువే ముట్టచెప్పి ఉంటారని నమ్మాల్సి వస్తుంది. సరే ఎంత ఇచ్చినా… ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఉండాల్సిన కనీస బాధ్యత అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం. పార్టీ నేతల్ని సమన్వయం చేసుకోవడం., అదీ కూడా లేకుండా.. తాను లండన్ టూర్‌కు వెళ్లి మిగతా వ్యవహారాలన్నీ పీకే టీంకి అప్పగిస్తే.. అది రాజకీయ యోగ్యత ఎలా అవుతుంది..?
ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడని మొత్తం బిందాస్ అంటారా..?
ఓ పార్టీ ప్లీనరీలో… వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేస్తూ… ఈయన ప్రశాంత్ కిషోర్.. మోడీని గెలిపించాడు. రేపు మనల్ని కడా గెలిపిస్తాడని ప్రకటించారు. ఆ ప్రకటన విని అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎవరో బీహార్ నుంచి వచ్చి జగన్ ను గెలిపించడం ఏమిటో కార్యకర్తలకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి.. తన వంతు ప్రయత్నం తాను చేయకుండా..ఆ వ్యూహకర్త చెప్పినట్లు చేస్తే చాలు గెలిచేస్తానని అనుకోవడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. జగన్‌కు తనపై తనకు నమ్మకం లేదు కాబట్టి… పీకే చెప్పినట్లు చేస్తున్నారు. పీకే చేసిన రాజకీయంతో… వైసీపీ ఇప్పటికే అనేక జిల్లాల్లో కుక్కలు చింపిన విస్తరిలా అయిపోయింది. సమన్వయకర్తలు.. నెలకొకరు చొప్పున మారిపోయారు. ఎవరికి టిక్కెట్ ఖరారు చేసినా… నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా తేడాగా మారిపోవడం ఖాయం. ఇవన్నీ పట్టించుకోకుడా.. జగన్మోహన్ రెడ్డి…నన్ను పీకేనే గెలిపిస్తాడంటూ… లైట్ తీసుకుంటున్నారు.
రాజకీయం అంటే వ్యాపారమా..?
రాజకీయం అంటే ఆర్థికంగా లాభనష్టాలు బేరీజు వేసుకుని చేసే వ్యాపారమని… దాని కోసం కన్సల్టెన్సీలను పెట్టుకున్నా తప్పు లేదన్న భావన.. జగన్‌లో కనిపిస్తోంది. తనకు చేతకాని సలహాలను తీసుకోవచ్చేమో కానీ.. పార్టీని పూర్తిగా… ఆ పీకే టీం చేతిలో పెట్టడమే… తేడా వ్యవహారం. వారు దాన్ని తమ వృత్తిలా చేస్తారు.. లాభం వచ్చే వ్యవహారాలు చక్క బెట్టుకుంటారు.. కానీ… రాజకీయాన్ని రాజకీయంలా చూడరు. జగన్ కూడా అలా చూడరు కాబట్టి సమస్య లేదు. అందుకే.. ఇప్పుడు పీకే టీం… జగన్ మీడియాను కూడా తన చేతుల్లోకి తీసుకుని.. ఏపీలో బీహార్ తరహా.. సామాజిక ఘర్షణలను రేపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. జగన్, ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వ్యాపారం అర్థం అయితే.. ఏపీ ప్రజలు… దీన్ని తీసుకుంటారు. కానీ ఎప్పుడైనా.. వాళ్ల రెచ్చగొట్టుడుకు… ఉద్రేకపడితే మాత్రం.. ఏపీని బీహార్ చేసేసి.. ఆ ముఠా తమ కలెక్షన్ తీసుకుని వెళ్లిపోతుంది. జగన్ లాభ పడతారు. తన రాజకీయ వ్యాపారం అధికారం అనే ప్రతిఫలం అందుకుంటారు. కానీ నష్టపోయేది మాత్రం ప్రజలే..!