వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతీ సమస్యపై స్పందిస్తుంటారు. అందుకు ఆయనని అభినందించాల్సిందే. ఆయన చాలా ముఖ్యమయిన సమస్య లేవనెత్తినా చివర్లో తను అధికారంలోకి రావడం గురించి మాట్లాడి ప్రజలు ఆయన చిత్తశుద్ధిని అనుమానించేలా చేసుకొంటారు. అధికారంలోకి వచ్చేందుకే ఏ రాజకీయ నాయకుడయినా ప్రజా సమస్యలపై పోరాడుతుంటాడు తప్ప నిజంగా ప్రజా సమస్యలని పరిష్కరించేయాలనే తపనతో కాదు. కానీ మాంసం తింటారని ఎవరూ మెళ్ళో ఎముకలు వేసుకొని తిరుగరు.
ప్రస్తుతం తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ రైతుల ఆత్మహత్యల సమస్యపై తెరాస ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. వారు తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు, తీరుపై చాలా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటారు కానీ ఎవరూ కూడా “త్వరలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది. మేము అధికారంలోకి వస్తాము. వచ్చిన తరువాత ఇలాగ చేస్తాము అలాగా చేస్తాము,” అని చెప్పుకోరు. ఒకవేళ అలాగా చెప్పుకొన్నట్లయితే వారి చిత్తశుద్ధిని ప్రజలు అనుమానిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ సమస్యపై పోరాడుతున్నా చివరికి ఆయన చెప్పే పరిష్కారం ఒకటే. “త్వరలో తెదేపా ప్రభుత్వం కూలిపోతుంది…తమ పార్టీ అధికారంలోకి వస్తుంది..అంటే తను ముఖ్యమంత్రి అయిపోతాడు అన్ని సమస్యలు తీర్చేస్తాడు.”
నిన్న ఆయన విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రామంలో రైతులను కలవడానికి వెళ్లినప్పుడు కూడా తన ప్రసంగాన్ని అదేవిధంగా ముగించారు. భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ భూసేకరణకు పూనుకొంది. దానిని స్థానిక రైతులు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక జగన్ వారికి అండగా నిలబడి వారి తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు అక్కడికి వెళ్ళారు. ఆయన తన ప్రసంగంలో చాలా మంచి పాయింట్లు లేవనెత్తారు.
1.అహ్మదాబాద్ విమానాశ్రయానాన్ని కేవలం 960 ఎకరాలలో, చెన్నై 1200 ఎకరాలలో, ముంబై 2000 ఎకరాలలో నిర్మించగలిగినప్పుడు భోగాపురం విమానాశ్రయానికి ఏకంగా 12,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు.
2. ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తామని చెపుతుంటే చంద్రబాబు నాయుడు భోగాపురం వద్ద మళ్ళీ కొత్తగా మరో విమానాశ్రయం ఎందుకు నిర్మించాలనుకొంటున్నారు?
3. విశాఖ విమానశ్రయం పక్కనే ప్రభుత్వానికి, నేవీ వాళ్ళకి చెందిన సుమారు 1,000 ఎకరాల ఖాళీ స్థలంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని తక్కువ ఖర్చుతో విస్తరించుకొనే అవకాశం ఉన్నప్పుడు భోగాపురం వద్ద మళ్ళీ కొత్తగా మరో విమానాశ్రయం ఎందుకు వద్ద మళ్ళీ కొత్తగా మరో విమానాశ్రయం ఎందుకు నిర్మించాలనుకొంటున్నారు?
మళ్ళీ ఆ ప్రశ్నలకు సమాధానం కూడా ఆయనే చెప్పారు. భోగాపురం సమీపంలో ఎంపీ అవంతీ శ్రీనివాస్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులకి భూములు ఉండటంతో వారికి లబ్ది చేకూర్చేందుకే అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్తగా మరో విమానాశ్రయం నిర్మించాలనుకొంటున్నారని జగన్ తెలిపారు. కానీ భూసమీకరణలో వారి భూములు పోకుండా కేవలం రైతుల భూములపైనే విమానాశ్రయం నిర్మించాలనుకొంటున్నారని అందుకే రైతుల భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. రైతులు గ్రామసభ నిర్వహించి ప్రభుత్వానికి తమ భూములు ఇవ్వమని తీర్మానించి దానిని కలెక్టర్ కి అందజేసినప్పటికీ ఆయన కూడా దానిని పట్టించుకోకుండా భూసేకరణకు అనుమతిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తమ భూములను ఎక్కడ గుంజుకొంటాడో అని ఆయనని చూసి రాష్ట్రంలో రైతులు అందరూ గజగజ వణికిపోతున్నారని జగన్ అన్నారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జగన్ చేసిన వాదన, ఆయన చూపిన పరిష్కారాలు, లేవనెత్తిన సమస్యలు, చేసిన ఆరోపణలు అన్నీ చాలా ఆలోచించదగ్గవే. కానీ యధాప్రకారం “త్వరలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది. మేము అధికారంలోకి వస్తాము. వచ్చిన తరువాత మీ భూములన్నీ మీకు ఇచ్చేస్తాము,” అని ముగించడంతో అంతవరకు ఆయన చెప్పిన ముఖ్యమయిన విషయాలన్నీ మరుగున పడిపోయి ఆయన చెప్పిన చివరి మూడు ముక్కలే అందరినీ ఆకర్షిస్తాయి.
ఆయన తమకు అండగా నిలబడి పోరాడేందుకు వచ్చేడని భావిస్తున్న రైతులకు ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కొంటే ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వారి భూములు గుంజుకొంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి అడ్డుపడతానని చెప్పడం లేదు. తను ముఖ్యమంత్రి అయిన తరువాత వారి భూములు తిరిగి ఇచ్చేస్తానని చెపుతున్నారు. మరి అటువంటప్పుడు తమకు అండగా నిలబడి పోరాడుతానని ఆయన రావడం ఎందుకు? వచ్చి మాత్రం ప్రయోజనం ఏమిటి? రైతులు పోగొట్టుకొన్న భూములు మళ్ళీ వారికి దక్కాలంటే జగన్ ముఖ్యమంత్రి అవ్వాలన్న మాట! తమ భూములు పోతున్నాయని రైతులు బాధపడుతుంటే నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి మీ సమస్యలు పరిష్కరిస్తానని జగన్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అయినా ఎన్నికల సమయంలో ఏ పార్టీ గెలుస్తుందో..ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మహామహులే ఖచ్చితంగా చెప్పలేరు. చెప్పగలిగి ఉండి ఉంటే బీహార్ ఎన్నికలలో సోనియాగాంధీ, నరేంద్ర మోడి, నితీష్ కుమార్ తదితరులు అందరూ అంత చెమటోడ్చవలసిన అవసరమే ఉండేది కాదు. కానీ జగన్ మాత్రం తను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిపోతానని నమ్ముతూ ప్రజలని కూడా నమ్మమని కోరుతున్నారు. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఆయన ఇలాగే చాలా ధీమా వ్యక్తం చేసారు. కానీ చంద్రబాబు నాయుడు ‘ఫౌల్ గేమ్’ ఆడేసి గెలిచేసారని జగన్ చాలాసార్లు ఆక్రోశం వ్యక్తం చేసారు. మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా ఎవరో ఒకరు అలాగే మరో ‘ఫౌల్ గేమ్’ ఆడరనే నమ్మకం ఏమిటి? అప్పుడు కూడా జగన్ గెలవలేకపోతే అప్పుడు రైతుల భూములు ఎలాగ వాపసు ఇస్తారు? అని ఆలోచిస్తే జగన్ చెపుతున్న మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో అర్ధం అవుతాయి.
ప్రతీ సమస్య గురించి ఎంతో ‘హోం వర్క్’ చేసిన తరువాత జగన్ పోరాటం మొదలుపెడతారు. కానీ వాటి ముగింపు మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అందుకే ప్రజలు కూడా ఆయన చిత్తశుద్ధిని అనుమానిస్తుంటారు. ప్రజల నమ్మకాన్ని పొందలేని వ్యక్తి ఎన్నడూ రాజకీయాలలో రాణించలేడనే సంగతి జగన్ గ్రహించడం చాలా అవసరం.
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రాన్ని మళ్ళీ ఎవరు చక్కదిద్దగలరు…అని ఆలోచించిన ప్రజలు చంద్రబాబు నాయుడు అందుకు సమర్ధుడు అని నమ్మారు. కనుకనే ఆయనకి అధికారం కట్టబెట్టారు. ఎందుకంటే ఆయన తన కార్యదక్షత, చిత్తశుద్దిని నిరూపించుకొని ప్రజల నమ్మకాన్ని పొందగలిగారు. కానీ జగన్ తను మొదలుపెట్టే ప్రతీ పోరాటంపై ప్రజలకు అనుమానం కలిగేలా వ్యవహరిస్తుంటారు. సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు తను ముఖ్యమంత్రి అవడం గురించి మాట్లాడి తను దాని కోసమే పోరాడుతున్నట్లు చెప్పకనే చాటిచెప్పుకొంటారు. ఈ లోపాన్ని జగన్ చక్క దిద్దుకోగలిగితే ప్రజలు కూడా ఆయన చేస్తున్న పోరాటాలను విశ్వసించడం మొదలుపెడతారు. ప్రజలు విశ్వసిస్తే అధికారం దానంతట అదే చంద్రబాబు నాయుడు ఒళ్ళో పడినట్లు జగన్ ఒళ్ళో వచ్చిపడుతుంది.