తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మధ్య కొంతమంది నేతలు ప్రతిపక్ష పార్టీ వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా వెళ్తున్నవారు టీడీపీ మీద రొటీన్ గా విమర్శలు చేస్తున్నా… పార్టీ వీడటానికి వారివారి వ్యక్తిగత కారణాలే ఎక్కువగా ఉన్నాయి. తాజా వలసపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో స్పందించారు. పార్టీ నాయకులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు చూసేసరికి జగన్ కి వెన్నులో వణుకుపుడుతోందన్నారు. దాంతో ఆయనకి దిక్కుతోచడం లేదని విమర్శించారు. టీడీపీని ఎలాగైనా దెబ్బతియ్యాలన్న లక్ష్యంతో ఉన్న కేసీఆర్ తో జతకలిశారనీ, ఆయన సాయంతోనే టీడీపీ నుంచి నాయకుల్ని లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. పార్టీ నుంచి ఇంకా ఒకరు లేదా ఇద్దరు నేతలు బయటకి వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
వైసీపీలోకి టీడీపీ నేతలు వెళ్లడం వెనక కేసీఆర్ హస్తం ఉందనడంలో సందేహం లేదని చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆస్తులున్న తెలుగుదేశం నేతల్ని లక్ష్యంగా చేసుకున్నారనీ, అలాంటివారితో కేసీఆర్ భేటీ అవుతున్నారనీ, జగన్ పార్టీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారని సీఎం మండిపడ్డారు. పదవుల మీద ఆశ ఉన్న కొద్దిమంది నేతలను మభ్యపెట్టేందుకు జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. హైదరాబాద్ లో ఆస్తున్నవారికి బతిమాలి, అవసరమైతే బెదిరించి కూడా వైకాపాలోకి చేర్చే ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. తప్పుడు సర్వేలు చూపిస్తూ మభ్యపెడుతున్నారన్నారు. పార్టీ నుంచి బయటకి వెళ్లేవారిని పట్టించుకోవద్దు అంటూ నేతలకు చంద్రబాబు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు వస్తుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. పోలవరం మీద కేసులు వేసినవారితో జగన్ లాలూచీ పడ్డారనీ, ఇలాంటివారు అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందన్నారు. మూడు పార్టీల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావన్నారు.
టీడీపీ నుంచి కొంతమంది నాయకుల్ని ఆకర్షించడం ద్వారా ఆ పార్టీని నైతికంగా కొంత దెబ్బతియ్యొచ్చు అనేది వైకాపా ప్లాన్ అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా, ఈ మధ్య సంక్షేమ పథకాల జోరును టీడీపీ పెంచిన తరువాత రాజకీయంగా వైకాపా మరింత వెనకబడిందనే భావన ఏర్పడింది. పాదయాత్ర ముగిశాక వైకాపా జోరు కాస్త తగ్గింది. దీంతో ఇప్పటికిప్పుడు ఆ భావనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వెయ్యాలంటే… వలసలే సరైన వ్యూహం అని వైకాపా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వలసల ప్రోత్సాహం వెనక కేసీఆర్ ఉన్నారనేది చంద్రబాబు తాజా ఆరోపణ!