లోక్ సభ ఎన్నికల్లో కూడా తెరాస ప్రచారం దుమ్మురేగిపోతుందనే అంచనాలుండేవి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సీఎం కేసీఆర్ ప్రసంగాలు దంచేస్తారనీ, ఉర్రూతలూగించేస్తారని సగటు తెరాస అభిమాని ఆకాక్షించాడు. సుడిగాలిలా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తారని భావించారు. అయితే, ప్రస్తుతం తెరాస ఎన్నికల ప్రచారం అంచనాలకు తగ్గట్టుగానే ఉందా? అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే… అదే స్థాయి దూకుడు, ఉత్సాహం తెరాస శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ కనిపిస్తోందా… అంటే లేదనే అభిప్రాయమే ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కేసీఆర్ ప్రచారానికి ఊపునిచ్చే అంశాలు ఇప్పుడు లేవనేది ఒక కారణంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీని విమర్శిస్తూ, స్థానికత సెంటిమెంట్ ను కేసీఆర్ బాగా రాజేసి వాడుకున్నారు. తెలంగాణ మళ్లీ చంద్రబాబు పాలన కిందకి వెళ్లిపోతుందనే భావోద్వేగ అంశాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందారనడంలో సందేహం లేదు. ఐదేళ్ల పాలన ఒక ప్రచారాంశమైతే, దానికి తగ్గట్టుగా సెంటిమెంట్ కూడా కలిసొచ్చింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మాంచి ఊపు మీద సాగించారు. ఇక, ఇప్పటి లోక్ సభ ఎన్నికల దగ్గరకి వచ్చేసరికి… ప్రచారంలో ఆ ఊపు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఇప్పుడు టీడీపీని విమర్శించినా వర్కౌట్ కాదు. పైగా, టీడీపీనిగానీ, ఏపీ అంశాలనుగానీ ఇప్పుడు తెలంగాణలో ప్రస్థావిస్తూ ప్రచారం చేస్తే… ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుకి సానుకూలంగా మారుతాయనే అంచనాతో కేసీఆర్ ఆ అంశాల జోలికి వెళ్లడం లేదు. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న నాటి శపథాలన్నీ ఇప్పుడు పక్కకు వెళ్లిపోయాయి. కొత్త మిత్రుడు జగన్ కి కూడా మాట సాయం చెయ్యలేకపోతున్నారు.
ఎంతసేపూ భాజపా, కాంగ్రెస్ అంటూ… జాతీయ రాజకీయాలే మాట్లాడుతున్నారు. ఆ రెండు పార్టీలపైనే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దాని వల్ల పెద్దగా ప్రయోజనమూ ఉండటం లేదు. ఎందుకంటే, తెలంగాణలో భాజపాకి సరైన ప్రాతినిధ్యమే లేదు. ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సీట్లు గెలిచెయ్యాలని భాజపా కూడా అనుకోవడం లేదు. తెరాసతో తమకు పోటీ అని కూడా ఆ పార్టీ అనుకోవడం లేదు. ఇక, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అయినా… అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పుడు తెరాసకు గట్టి పోటీగా నిలబడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సహజంగానే తెరాస వర్గాలకు కొంత ధీమా వచ్చేస్తుంది. అలా వచ్చిన నిర్లక్ష్యానికి సాక్ష్యమే హైదరాబాద్ లో ఫెయిలైన కేసీఆర్ సభ. ప్రచార సరళిలో గతం కంటే ఊపు తగ్గిన పరిస్థితి తెరాసలో కనిపిస్తోంది. మరి, ఇది పార్టీకి గెలుపు ధీమా ఆవహించేయడం వల్ల వచ్చిందా, ఎమ్మెల్సీ స్థానం గెలుచుకున్న ధీమాతో కాంగ్రెస్ చెబుతున్నట్టు ప్రజల్లోనే తెరాస పట్ల అసంతృప్తి వ్యక్తమౌతోందా అనేది ఎన్నికల తరువాత చూడాలి.