కాస్త ఆలస్యం కావొచ్చు… లేటు గా అయినా లెటెస్టుగా కేసీఆర్ వస్తారు… ఇది కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాట. రైతు రుణమాఫీ సరిగ్గా జరగలేదు, రైతుబంధు ఆగిపోయింది, కళ్యాణలక్ష్మి చెక్కులు రావటం లేదు… ఇలా బీఆర్ఎస్ నేతలు ఎన్నో విమర్శించినా, కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు. ఒక్కటంటే ఒక్క మాట విమర్శించలేదు.
కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదు… కేటీఆర్-హరీష్ రావు మొత్తం చూసుకుంటారు అన్న వారు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ అనుకూల మీడియా… ఇక కేసీఆర్ వచ్చేస్తున్నారు, షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది అంటూ ప్రచారం చేసినా నెరవేరలేదు. కానీ, తాజాగా మరోసారి అలాంటి ప్రచారమే షురూ అయ్యింది.
కేసీఆర్ స్వయంగా ప్రకటించబోతున్నారు.. .రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న దగాను ప్రశ్నించటానికి జిల్లాలు తిరగబోతున్నారు, కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాటానికి సమరశంఖం పూరించనున్నారు అన్నది తాజా ప్రచారం.
సోషల్ మీడియా వరకు ఓకే… గ్రౌండ్ లో బీఆర్ఎస్ పోరాటం జీరో. కేటీఆర్-హరీష్ రావు ఎంత విమర్శించినా అది హైదరాబాద్ లోనే. గ్రౌండ్ కు వెళ్లిన సందర్భాలు అరుదు. ఇప్పుడు కేసీఆర్ రైతులను ఓదార్చుతూ, నీళ్లు పారని కాలువలను పరిశీలిస్తూ, రైతుబంధు రాక ఆగమైన రైతులకు భరోసా ఇస్తూ పర్యటిస్తారని… తద్వారా ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో పోరాటం మొదలుపెట్టినట్లే అంటోంది బీఆర్ఎస్.
ఈసారైనా కేసీఆర్ పర్యటన నిజమౌవుతుందో… ప్రచారంగానే మిగిలిపోతుందో చూడాలి.