హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడ అఖిలేష్, కేజ్రీవాల్ వంటి వారితో భేటీ అయ్యారు. ఆ తర్వాత … దేశంలో ఓ రాజకీయ సంచలనం జరగాల్సి ఉందని… జరుగుతుందని ప్రకటించారు. ఆ సంచలనం ఏమిటన్నదానిపై ఆయన ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అయితే చెప్పి చేసేవి… చేయాలనుకున్నవి ఎప్పటికీ సంచనాలు కావు. అనుకోకుండా జరిగితేనే సంచలనాలు అవుతాయి. అయితే కేసీఆర్ ప్లాన్డ్గా సంచలనం సృష్టించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత బీజేపీ తెలంగాణలో పూర్తి స్థాయి రాజకీయం చేయబోతోందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లోనే బీజేపీకి షాకిచ్చి సంచలనం సృష్టించాలనుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందు కోసం ఇతర పార్టీలతో సంప్రదింపుల కోసమే ఢిల్లీ వెళ్లారని… ఆ తర్వాత ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలను సందర్శించే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి బీజేపీకి.. ఎన్డీఏకు ఆటంకాలు లేవు. వైసీపీ, బీజేడీ లాంటి పార్టీలు బీజేపీ రాడార్ దాటిపోవు. అయితే వైసీపీ లాంటి పార్టీ హ్యాండ్ ఇస్తే మాత్రం… బీజేపీకి షాక్ తగలొచ్చు. రాజకీయంగా సంచలనం నమోదు కావొచ్చు. కేసీఆర్తో జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ దిశగా ఏమైనా సంచలనాలు ప్లాన్ చేస్తున్నారేమో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం గట్టి ప్రణాళికల్లో ఉన్నారని తన మాటల ద్వారానే వెల్లడిస్తున్నారు.
జగన్ ఇప్పటికిప్పుడు.. బీజేపీని ధిక్కరించి కేసీార్ వెంట నడిచే పరిస్థితిలేదు. బీజేపీ పరిస్థితి బాగో లేదనుకుంటే ఆయన ఎన్నికలకు ముందు బయటపడే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే అప్పటి వరకూ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉండదు.