తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల బీజేపీపై యుద్దం ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు ఖాయమని ఆయన గట్టిగా నమ్మారు. మీడియా సమావేశాల్లోనూ అదే చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని జోస్యం కూడా చెప్పారు. సమాజ్ వాదీ గెలవకపోయినా పర్వాలేదు.. కనీసం 175కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే మాత్రం బీజేపీ ఖతం అవుతుందని కేసీఆర్ తేల్చేశారు. కానీ ఎస్పీ 120 దగ్గరే ఆగిపోయింది. బీజేపీ హవా ఏ మాత్రం తగ్గలేదని తేలిపోయింది.
గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు కూడాకేసీఆర్ బీజేపీ పై యుద్దం ప్రకటించారు. కానీ గ్రేటర్ ఫలితాలు వచ్చిన మర్నాడే ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షాలతో సమావేశమయ్యారు. బీజేపీతో రణం లేదు..రాజీ లేదని పార్టీ నేతలకు నేరుగా చెప్పారు. పార్టీని కాపాడుకోవాల్సి ఉందన్నారు. అప్పట్లో సైలెంట్ అయిన కేసీఆర్ మళ్లీ ఇటీవలే బీజేపీపై యుద్దం ప్రకటించారు. దొరికిన ప్రతీ అస్త్రాన్ని బీజేపీతో ముడి పెట్టి విమర్శించడం ప్రారంభించారు. చివరికి చివరికి బడ్జెట్ ప్రసంగంలోనూ బీజేపీ,కేంద్రంపై విమర్శలు చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం రెడీ కాలేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కేసీఆర్ రాజకీయాల గురించి తెలిసిన వారు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడితే తప్ప కేసీఆర్ దూకుడు కొనసాగించరని… ఏ మాత్రం బీజేపీకి సానుకూలత ఉన్నట్లుగా తేలినా మళ్లీ సైలంట్ అయిపోతారని విశ్లేషిస్తూ వస్తున్నారు. ఆయన బీజేపీ శరణు కోరుతారని ఏబీఎన్ ఆర్కే లాంటి వారు తమ కొత్త పలుకులో చెబుతూ వస్తున్నారు.
ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది తెలంగాణ రాజకీాయల్లో కీలకంగా మారింది. గతంలోప్రకటించినట్లుగా యుద్ధం కొనసాగిస్తారా లేకపోతే.. సడెన్గా ఢిల్లీ వెళ్లి మోడీ, షాలతో సమావేశం అవుతారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ ధ్రిల్లర్గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బీజేపీతో పెట్టుకోకపోవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు.