వారానికో మంత్రి వివాదంలోకి వెళ్తున్నారు. వారి తీరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. మరో వైపు ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ టీంతోనే ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏమిటన్న ఆందోళన టీఆర్ఎస్లో పెరుగుతోంది. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ఎనిమిది నెలలుగా కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గంలో స్వల్పమార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షా లకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దు బాటు చర్యలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. గతంలో ఓ మంత్రి రాసలీలల ఆడియో బయటకు వచ్చింది. అది ప్రో టీఆర్ఎస్ మీడియాలోనే హైలెట్ అయింది. ఆ మంత్రిపై గ్రానైట్ అక్రమ రవాణా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఖమ్మం మంత్రి అజయ్ కుమార్ సంగతి చెప్పాల్సిన పని లేదు. మంత్రి మల్లారెడ్డి అసలు వివాదాల కోసమే మంత్రయ్యారా అన్నట్లుగా ఉంటారు. మరో నలుగురైదుగురు మంత్రులు పనితీరు విషయంలో ప్రజాగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు వీరందర్నీ పెట్టుకుని కేసీఆర్ ఎన్నికలకు వెళ్లడం అంటే.. వ్యూహాత్మక తప్పిదమేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
మంత్రివర్గాన్ని మార్చడానికి కేసీఆర్ ఎప్పుడో ప్రణాళికలు వేసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఉండ బండా ప్రకాష్‌ను ఎమ్మెల్సీ చేశారు. కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. చాన్స్ లేదనుకున్న కడియం శ్రీహరికీ అవకాశం కల్పించారు. కేబినెట్ సమీకరణాలతోనే వీరికి అవకాశం కల్పించారని టీఆర్ఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. కేసీఆర్ ఏ క్షణమైన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే చేస్తారని ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే వివాదాస్పదమైన మంత్రుల్ని ఆయన తొలగిస్తారని.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గుర్ని తొలగిస్తారని చెబుతున్నారు. ఏపీ కేబినట్లోనే సీఎంతో కలిసి రెడ్డి సామాజికవర్గ మంత్రులు ఐదుగురు ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఆరుగురు ఉన్నారు. ఈ లెక్కలన్నీ కరెక్ట్ చేసుకోకుండా ఎన్నికలకు వెళ్తే ఎలా అనే వాదన టీఆర్ఎస్లోనే ఎక్కువగా వినిపిస్తోంది.