తెలంగాణలో కొత్త రాజకీయాలు అవసరమనీ, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలు ఆకాంక్షలు తీరలేదంటూ తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించారు కోదండరామ్. అంతేకాదు, ఇక నుంచి రాష్ట్రంలో జరగబోయే అన్ని రకాల ఎన్నికల్లోనూ జన సమితి పోటీకి దిగుతుందన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ పడాలనుకునేవారు దరఖాస్తులు చేసుకోవాలని ఈ మధ్యనే ప్రకటించారు కూడా! స్థానిక సంస్థల సంగతి ఓకే… 2019 అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఏంటనేదే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది..? వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని అంటున్నారేగానీ… అన్ని నియోజక వర్గాల్లో పోటీకి దిగే నాయకులు ఎవరు అనేదే ప్రశ్న..? ఇంతవరకూ, జన సమితి కొత్తగా నాయకుల్ని చేర్చుకున్నదీ లేదు, ఇతర పార్టీల నుంచి ఆకర్షించిందీ లేదు.
వచ్చే ఎన్నికల్లో 25 నుంచి 30 స్థానాలనైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో కోదండరామ్ ఉన్నారని అంటున్నారు. ఆ మాత్రం సీట్లు దక్కించుకున్నా, నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా పార్టీ నిలుస్తుందనేది వారి అంచనాగా తెలుస్తోంది. అలాంటప్పుడు, కనీసం ఆ మేరకు పేరున్న నాయకులు పార్టీలోకి రావాలి కదా. కాస్త పేరు, జనాల్లో గుర్తింపు ఉన్న కొద్దిమంది నేతలైనా పార్టీలో ఉండాలి. ఇప్పట్నుంచే ప్రచారంలోకి దిగాలి. కానీ, ఆ తరహా ప్రయత్నమేదీ ప్రస్తుతం జన సమితిలో జరుగుతున్న దాఖలాలు లేవనే అంటున్నారు. అయితే, పార్టీకి కావాల్సిన నేతల వారే వస్తారన్న ధీమాతో కోదండరామ్ ఉన్నారట!
సరిగ్గా ఎన్నికల ముందు జన సమితిలోకి నేతలు వస్తారట! ఎక్కడి నుంచి అంటారా… తెరాసలో సీట్లు దక్కనివారు తమవైపే చూస్తారట! తెరాసలో టిక్కెట్లు దక్కనివారు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉండదనీ, కాబట్టి ప్రత్యామ్నాయంగా జన సమితి మాత్రమే వారికి కనిపిస్తుందన్న ధీమాతో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, కాంగ్రెస్ లో అసంతృప్త నేతలు చాలామంది ఉన్నారనీ, ఎన్నికల సమయం వచ్చేసరికి వారి ఎంపిక కూడా జన సమితి పార్టీ అవుతుందనే అంచనాలో కూడా ఉన్నారు. వ్యూహాత్మకంగా ఇది కరెక్టే కావొచ్చు. కానీ, ఆ రెండు పార్టీల నుంచి వచ్చిన నేతలు జన సమితి లక్ష్యానికి ఎంతవరకూ ఉపయోగపడలరనేదే ప్రశ్న..? తెరాస అయినా, కాంగ్రెస్ అయినా ఒక నాయకుడిని వదులుకుంటోందంటే దానర్థం ఆ నాయకుడి అవసరం పార్టీకి లేదనీ, లేదా గెలిచే అవకాశం లేదన్న విశ్లేషణతోనే కదా! మరి, అలాంటి వారి మీద జనసమితి ఆశలు పెట్టుకుంటే… కోదండరామ్ ఆశించిన ఫలితం నెరవేరుతుందా అనేదే చర్చనీయం.