గత కొద్ది రోజులుగా అసలేమాత్రం చర్చకు లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన ఫోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేసున్నారని ఆరోపించారు.
కౌశిక్ రెడ్డి ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందా..? లేదా అన్నది పక్కనపెడితే.. ఆయన లేవనెత్తిన ఈ అంశం బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతోపాటు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు పలువురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి.
అయితే, ఇదంతా బీఆర్ఎస్ బాస్ ఆదేశాల మేరకు చేసినట్లుగా రాధకిషన్ రావు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావును విచారించిన తర్వాత కేసీఆర్ ను నోటీసులు ఇస్తారనే వాదనలు వినిపించాయి. అనారోగ్య కారణాలను సాకుగా చూపిస్తూ అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు మరికొద్ది రోజుల్లోనే స్వదేశానికి రానున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అమెరికా వెళ్ళడంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు కీలక సూచనలు చేసేందుకు అక్కడికి వెళ్ళారని విమర్శలు చేస్తోంది.
ఈ రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా.. పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ రాగం ఎత్తడంతో..ఈ విషయంపై కన్నా ప్రభాకర్ రావును కలిసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్ళారన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. జనాల్లో చర్చ లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టి.. కేటీఆర్ ను బుక్ చేశారన్న టాక్ నడుస్తోంది.