ఈటల రాజేందర్‌ను ఓడించాలని హరీష్ రావు క్షేత్ర స్థాయిలో కిందామీదా పడి పని చేస్తూంటే హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ పెద్దలు అమలు చేస్తున్న వ్యూహం మాత్రం తేడాగా ఉంది. ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అన్నీ ట్రాన్స్ ఫర్ అయ్యేలా విభిన్నమైన వ్యూహం అమలు చేస్తున్నారు. వ్యూహాత్మమా.. కావాలని చేస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. కేటీఆర్ చిట్ చాట్ చేసినా. .. ప్రత్యేక ఇంటర్యూలు ఇచ్చినా ఇదే రకమైన ప్రకటనలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట టీఆర్ఎస్ భవన్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన ఎన్నికలయిన తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకే వెళ్తారని చెప్పారు. ఆయన అన్న మాటలకు విస్తృత ప్రచారం జరిగింది.
ఇప్పుడు మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇస్తున్న కేటీఆర్ .. ఈటల , రేవంత్ రహస్య భేటీ అయ్యారని కూడా చెబుతున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేటీఆర్‌కు రహస్య సమాచారం వచ్చి ఉండవచ్చేమో కానీ.. దాన్ని అలా బయట పెట్టడం వల్ల.. నిజంగానే రేవంత్, ఈటల భేటీ అయ్యారని.. ఎన్నికల్లో గెలిచి ఈటల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న ఉద్దేశంతో ఆ పార్టీ ఓటర్లు ఈటలకే ఓటు వేస్తారన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. అలా జరిగే అవకాశం ఉన్నా.. ఎందుకు కేటీఆర్ పదే పదే ఈ ప్రచారం చేస్తున్నారని రాజకీయవర్గాలుకు అంతబట్టడం లేదు.
అయితే కేటీఆర్ కూడా వ్యూహాత్మకంగానే అంటున్నారని.. కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఎలా ఓటు వేస్తారని.. అలా వేయడం ఇష్టం లేక… టీఆర్ఎస్కు వేస్తారని ఆయన భావిస్తున్నారని అంటారు. అయితే ఈటల రాజేందర్ తనను తాను బీజేపీ అభ్యర్థిగా ఎక్కువగా చెప్పుకోవడం లేదు. అక్కడ ఈటల గుర్తు కమలం అని ఉంది కానీ బీజేపీ అభ్యర్థి ఈటల అని భావించడం లేదంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌కు వెళ్లాల్సిన ఓట్లు ముఖాముఖి పోరులో టీఆర్ఎస్, బీజేపీ ఎక్కువ ఎవరు పొందుతారో వారికే విజయం దక్కే చాన్స్ ఉంది.