నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున… ఇద్దరూ ఒక తరం హీరోలే. దాదాపుగా ఒకేసారి తమ ప్రయాణం ప్రారంభించారు. కానీ ఎందుకో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఎందుకో… బాలయ్య, నాగ్ మధ్య లేకుండా పోయింది. ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ నడిచిందని, నడుస్తోందని ఇండస్ట్రీ వర్గాల మాట. ఈ విషయం చాలాసార్లు రుజువయ్యింది కూడా. చాలా కాలం ఇద్దరి మధ్య మాటల్లేవు. అయితే ఇప్పుడు వీరిద్దరినీ ‘అన్ స్టాపబుల్’ కలుపుతోంది.
ఆహాలో అన్ స్టాపబుల్ ఓ సూపర్ హిట్ షో. ఆహా సబ్ స్క్రైబర్లని పెంచడానికి ఈ షో చాలా ఉపయోగపడింది. ఇప్పటికి రెండు సీజన్లు దిగ్విజయంగా నడిచాయి. సీజన్ 3 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈసారి ఈ షోకి చిరంజీవి, వెంకటేష్ వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తెలిసిందేంటంటే.. నాగార్జున కూడా ఈ షోలో అడుగు పెట్టబోతున్నాడట. నాగ్ తన ‘కుబేర’ టీమ్ తో కలిసి ఈ షోలో పాలు పంచుకోనున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే ఈ సీజన్‌కే ఈ ఎపిసోడ్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కానుంది. దీంతో నాగ్ – బాలయ్య మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోయినట్టే. 50 ఏళ్ల నట ప్రయాణం పూర్తయిన సందర్భంగా ఈ సెప్టెంబరు 1న బాలయ్యని తెలుగు చలన చిత్రసీమ ప్రత్యేకంగా సన్మానించబోతోంది. ఈ కార్యక్రమానికి తెలుగులోని ప్రముఖ కథానాయకులంతా పాల్గొననున్నారు. నాగార్జున కూడా ఈ ఈవెంట్ లో పాలు పంచుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచే… నాగ్ – బాలయ్య మధ్య దూరం తగ్గబోతోందని, అన్ స్టాపబుల్ షోతో… అది పూర్తిగా తొలగిపోతుందని ఇన్ సైడ్ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి.