పవన్ కల్యాణ్ ఎప్పుడోగానీ మీడియా ముందుకు రాడు. ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు అతి తక్కువ. మైకు ఇచ్చినా మాట్లాడడు. నలుగురి ముందూ సిగ్గుపడిపోతుంటాడు. అందుకే పవన్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా అదో సంచలనం అవుతుంది. ఏం మాట్లాడినా అభిమానులకు అపురూపంగా కనిపిస్తుంది. అనుపమ చోప్రాకి పవన్ ఇంటర్వ్యూ ఇస్తాడు అనగానే, అందులో ఏముంటుందా? అని ఆసక్తి కనబరిచారు నెటిజన్లు.విషయం ఏదైన సరే, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే పవన్ నోటి నుంచి సంచలనాలు వస్తాయని ఆశించారు. ఆ ఇంటర్వ్యూ నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుందని లెక్కలేశారు. కానీ… అంకెలు చూస్తే పవన్ ఇంటర్వ్యూ ఫ్లాప్ అయ్యిందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.
పవన్ నుంచి ఓ టీజర్ వస్తేనో, మేకింగ్ వీడియో వస్తేనో యూ ట్యూబ్లో హిట్స్ అదిరిపోతాయి. ఒక్క రోజులోనే పది లక్షల హిట్స్ వచ్చిపడిపోతాయి. కానీ ఇంటర్వ్యూకి మాత్రం అలాంటి స్పందన లేదు. మూడు పార్టులుగా ఇంటర్వ్యూ విభజించడం చాలా పెద్ద దెబ్బకొట్టింది. మూడూ కలిపితే 4 లక్షల వ్యూస్ కూడా రాలేదు. దానికి తోడు `త్వరలో సినిమాలు మానేస్తా` అన్న పాయింట్ తప్ప సంచలన విషయాలేం లేవు. ఇంటర్వ్యూ ఆసాంతం ఇంగ్లీష్లోనే సాగడం మరో పెద్ద దెబ్బ. పవన్ మాటలు కూడా చాలామందికి అర్థం కాలేదనే చెప్పాలి. మొత్తానికి భారీ ఆర్భాటం గా మొదలై.. పవన్ ఇంటర్వ్యూ చప్పగా ముగిసినట్టైంది.