జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెల్లగా బీజేపీకి దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి పని చేసే ప్రశ్నే లేదని.. కేంద్రంతో మాత్రం సన్నిహితంగా ఉంటామని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మకూరులో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఆయన సిద్ధగా లేరు. పోటీకి దూరమని ప్రకటించారు కానీ పోటీ చేస్తామంటున్న బీజేపీకి ఆయన మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మరో వైపు రాష్ట్ర పర్యటనకు వస్తున్న నడ్డా ను కలిసే చాన్స్ కూడా లేదని ఆయన ప్రకటించారు.
ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ ను దూరం పెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు కలిసే నిర్వహించాలని అనుకుంటున్నప్పుడు జనసేనను పిలవాలి.. కానీ పిలవడం లేదు. గోదావరి గర్జన పేరుతో నిర్వహిస్తున్న సభకు కూడా పవన్ కల్యాణ్ కు ఎలాంటి ఆహ్వానం అందలేదు. కనీస సమాచారం కూడా లేదు. నడ్డా ఏపీకి వస్తూ.. మేజర్ మిత్రపక్షమైన జనసేనకు సమాచారం ఇవ్వకపోవడంతో జనసేన అగ్రనేతలు కూడా నొచ్చుకున్నారు. తనకేమీ తెలియదని.. కలిసే అవకాశం కూడా లేదని.. పవన్ తెగేసి చెప్పారు.
పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కొంత మంది బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే నడ్డా టూర్‌కు అసలు పవన్ ను ఆహ్వానించకుండా ఆయనను సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్‌ను డీ గ్రేడ్ చేసే ప్రయత్నమని భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలను అసలు పట్టించుకోనని పవన్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వారంతా వైసీపీ కోవర్టులేనని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.
రాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ తీరుపై పవన్ కల్యాణ్ అన్ని విశ్లేషించుకున్న తర్వాతనే .. దూరంగా ఉండటం మంచిదన్న భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. కేంద్ర అవసరాలో.. లేకపోతే.. మరో రకమైన రాజకీయమో కానీ.. వైసీపీని వారు ప్రోత్సహిస్తున్నారని.. తాను మధ్యలో అమాయకంగా బలైపోతున్నానన్న అభిప్రాయానికి పవన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆయన బీజేపీకి దూరమైనట్లుగానే భావిస్తున్నారు.