2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్ధతు తెలపడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటిగా వైఎస్ హయాంలో జరిగిన భూ దందాల గురించి ప్రస్తావించాడు పవన్. అసలు రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం వైఎస్ జమానాలో చోటు చేసుకున్న రియల్ ఎస్టేట్ దందాలే అనే స్థాయిలో చెప్పుకొచ్చాడు పవన్. అప్పట్లో పవన్ చెప్పిన మాటలు నిజం కూడా. అంతకు ముందు ఎప్పుడూ లేనంతగా వైఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ దందాలు నడిచాయి. అందుకే ప్రజలు కూడా పవన్ మాటలకు కనెక్ట్ అయ్యారు.
మరి ఇప్పుడేం జరుగుతోంది? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంటున్న భూ దందాల వార్తలు చూస్తుంటే భవిష్యత్‌ని ఊహించుకుంటేనే భయం గొలిపేలా ఉంది. దానికి తోడు ప్రభుత్వాల భూ కేటాయింపులు కూడా ఇష్టారీతిన ఉంటున్నాయి. ముఖ్య నాయకులు, నాయకుల వారసులే అడ్డంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రులేమో తప్పులు చేసినవాళ్ళను కఠినంగా శిక్షిస్తాం అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవైపు భూ కబ్జాలకు పాల్పడిన వాళ్ళు కూడా అదే వేదికపై నుంచి ముఖ్యమంత్రిని ప్రస్తుతిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. తెలంగాణాలో భూ దందాల గురించి అయినా కొంత వరకూ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పూర్తిగా మీడియాను మేనేజ్ చేస్తున్నారు. వైఎస్ హయాంలో దందాలు జరుగుతున్నప్పుడు ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు పవన్. అలాగే తెలంగాణా రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ఏమీ మాట్లాడని పవన్…తీరా తెలంగాణా విడిపోయాక మాత్రం ఒక సభ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేశాడు. చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఐదేళ్ళ పాలనా కాలం అయిపోయాకనో…చివరలోనో ఇప్పుడు జరుగుతున్న దందాల గురించి ప్రశ్నించేలా ఉన్నాడు పవన్. అలాంటి రాజకీయం పవన్‌కి కలిసొస్తుందేమో కానీ ప్రజలకు ఒరిగేది ఏమైనా ఉంటుందా?