చార్ సౌ పార్ అనే నినాదంతో ఎన్నికల సంగ్రామంలోకి దూకిన బీజేపీ మరోసారి మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతోంది. హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకుంటామని , ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపడుతారని గొప్పగా ప్రచారం చేసుకున్నారు.
కానీ, ఈసారి బీజేపీ మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సూచనలు కనిపించడం లేదని, ఇండియా కూటమితో కాంగ్రెస్ బలమైన పోటీనిచ్చిందని విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ గెలుపుపై నిర్దిష్టంగా చెప్పలేమనే వాదనలు కూడా వినిపిస్తోన్న దశలో బీజేపీలో జరుగుతోన్న పరిణామాలు సంచలనంగా మారాయి.
వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం మోడీ- షాలు మాత్రమేనని ప్రచారంపై ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ రెండుగా చీలిందని, ఆర్ఎస్ఎస్ – మోడీ వర్గాలుగా విడిపోయిందని… అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే నితిన్ గడ్కరీని మోడీ, షాలు దూరం పెట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో నాగ్ పూర్ నుంచి పోటీ చేస్తోన్న గడ్కరీని ఓడించేందుకు కుట్రలు కూడా పన్నారనే విమర్శలు వచ్చాయి. గడ్కరీని ఓడించాలనే ప్లాన్ లో భాగంగా ఆయనకు అనుకూలంగా ఉన్న 1.5 లక్షల ఓట్లను ఓటర్ జాబితాలో నుంచి మాయం చేశారనే ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. అందుకే గడ్కరీ గెలుపు కాంక్షిస్తూ మోడీ,షాలు నాగ్ పూర్ లో ప్రచారం చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ అన్ని పరిణామాలపై ఫోకస్ పెట్టిన ఆర్ఎస్ఎస్… ఎన్నికల ఫలితాల ఆధారంగా సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా వస్తే సరేసరి.. మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం నితిన్ గడ్కరీకి బాధ్యతలను అప్పగించాలనే ప్లాన్ లో ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది.