ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు తగ్గబోతున్నాయి. దాదాపుగా రెండు శాతం మేర వారికి జీతాల్లో కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకమైన పీఆర్సీ ఉండేది. అప్పుడు వారు కార్పొరేషన్లో ఉండేవారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు 25 శాతం ఐఆర్ ఇచ్చారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఆర్టీసీని అలాగే ఉంచేసి ఉద్యోగుల్ని మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసింది.
ఇప్పుడు వారు ఆర్టీసీ ఉద్యోగులు కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ అనే ప్రభుత్వ విభాగంలో ఉద్యోగులుగా మారిపోయారు. అయితే వారికి ఇటీవల ఉద్యోగులకు ప్రకటించిన ఇరవై మూడు శాతం పీఆర్సీని అమలు చేయలేదు. అలా అమలు చేస్తే వారికి రెండు శాతం పీఆర్సీ తగ్గిపోతుంది. ఇప్పటికే వారికి ఇరవై ఐదు శాతం పీఆర్సీ అమలులోఉంది. అందుకే ఆగిపోయారు. కానీ ఇప్పుడు వారికి మద్దతుగా ఇతర సంఘాలేవీ రాని పరిస్థితిని చూసుకుని.. జీతం తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన జీవోలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిజానికి ఇలా జీతం తగ్గించడం కూడా గతంలో చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధమే. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఉద్యోగుల జీతాలు తగ్గించకూడదని ఆర్టీసీ ఉద్యోగసంఘాలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది .కానీ ఇప్పుడు తగ్గించడానికే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. జీతాలు ఇస్తున్నందున ఆర్టీసీ ఆదాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటోంది. ఇప్పుడు జీతాలు తగ్గించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల అనేక సౌకర్యాలను కోల్పోతున్నామని వారు బాధపడుతున్నారు. కొత్తగా జీతాల తగ్గింపంటే ఇబ్బంది పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.