తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్ కొనసాగిస్తోన్న కేటీఆర్ ఇక సర్కార్ పై సమరమేనంటూ యాక్షన్ ప్లాన్ కు దిగారు. చార్మినార్ వద్ద ధర్నా చేపడుతామని స్పష్టం చేయడంతో ఈ అంశం మరింత పొలిటికల్ టెంపో క్రియేట్ చేస్తోంది.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లను ఎంబ్లమ్ నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదని ఉద్యమ తరహా విస్తృతిని చాటుతున్నారు కేటీఆర్. ఈ అంశంపై యుద్ధం ప్రకటించిన కేటీఆర్ చార్మినార్ వద్ద ధర్నాకు పిలుపునివ్వడం వ్యూహాత్మకం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎలాగూ ఈ ధర్నాకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్టు లేదు, దాంతో అరెస్ట్ ఖాయమని అంచనా వేసి దానిని కూడా రేవంత్ సర్కార్ పై అస్త్రంగా ప్రయోగించాలని ముందస్తు వ్యూహంతో బీఆర్ఎస్ ఈ ప్లాన్ చేసినట్టుగా అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
తెలంగాణ అస్తిత్వం కోసం గొంతెత్తితే అరెస్టుల పర్వం కొనసాగుతుందని.. దానిని పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ ధర్నాకు పిలుపునిచ్చి ఉంటారని విశ్లేషిస్తున్నారు. తద్వారా గతంలో తమకు దూరమైన కొంతమంది తెలంగాణ వాదులు మళ్ళీ తమ గొడుగు కిందకు వస్తారని అంచనాతో కేటీఆర్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.