నేటి రాజకీయాల్లో విలువలు, సంప్రదాయాల గురించీ మాట్లాడటం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిది! నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ సంప్రదాయం గురించి కొంతమంది తెలుగుదేశం నేతలు ఓ వాదన వినిపిస్తున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. వైకాపా, టీడీపీలు ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నిక నేపథ్యంలో టీడీపీలో టిక్కెట్ల సిగపట్లు, శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ టిక్కెట్ భూమా కుటుంబానికి చెందినవారికే అనేది ఫిక్స్ అయిపోయింది. అయితే, భూమా చనిపోయారు కాబట్టి… అలాంటి చోట పోటీ ఉండకూడదనీ అదే సంప్రదాయమని టీడీపీ నేతలు అంటున్నారు.
నంద్యాల ఉప ఎన్నికలో వైకాపా పోటీకి దిగడం సరైన పద్ధతి కాదని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఇది రాజకీయ సంప్రదాయం కాదని అన్నారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయడమే మన సంప్రదాయమనీ, వైకాపా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా ఇదే ఆనవాయితీ గురించి మాట్లాడారు! ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో పోటీ ఉండకూడదనీ, గతంలో టీడీపీ కూడా ఇదే సంప్రదాయన్ని అనుసరించి పోటీకి దిగని సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. ఏతావాతా తెలుగుదేశం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే.. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలనీ, అక్కడ పోటీ ఉండకూడదనీ, అదే సంప్రదాయమనీ!
నిజానికి, భూమా నాగిరెడ్డి వైకాపా టిక్కెట్ పై గెలిచారు. టీడీపీలోకి ఫిరాయించారు. సాంకేతికంగా ఆయన వైకాపా ఎమ్మెల్యేనే. ఎందుకంటే, ఆయన రాజీనామా చెయ్యలేదు. అసెంబ్లీ రికార్డుల్లో చూసుకున్నా ఆయన వైకాపా ఎమ్మెల్యే అనే ఉంటుంది. కానీ, ఫిరాయించారు కాబట్టి ఆయన టీడీపీ ఎమ్మెల్యే కిందే లెక్క అనేది టీడీపీ నేతల వాదన! సో.. నంద్యాల టిక్కెట్ తమదేననీ, వైకాపా పోటీకి దిగడం రాజకీయమనీ, కొన్ని విలువలు పాటించాలనీ అనేది అధికార పార్టీ అభిప్రాయం!
ఫిరాయింపు రాజకీయాలే ఒక జాఢ్యం. ఫిరాయించిన నేతలతో రాజీనామాలు చేయించకపోవడం, వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం అనేది కుసంస్కారం. ఇప్పుడు నంద్యాల విషయంలో టీడీపీ వాదన ఎలా ఉందంటే… ఫిరాయింపులకు కూడా ఒక గౌరవం ఆపాదించి పెట్టే ప్రయత్నంలా ఉంది! మరి, ఇదే ఫిరాయింపులు తెలంగాణలో జరుగుతుంటే… పోరాటం చేయాలంటున్నది ఈ టీడీపీనే. ఇదే ఫిరాయింపులు వైయస్సార్ జమానాలో జరిగితే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని ఈ టీడీపీ నేతలే విమర్శించేవారు. వారి వరకూ వచ్చేసరికి సంప్రదాయాలూ, విలువలూ, ఆనవాయితీలు అంటూ సమర్థనీయ ధోరణిలో మాట్లాడుతున్నారు!