జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక… మలయాళ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఆ తాకిడి మిగిలిన చిత్రసీమలకూ తాకుతోంది. ‘మాకూ అలాంటి కమిటీ ఒకటి వేయండి.. నిజాలు నిగ్గు తేల్చండి’ అని వివిధ పరిశ్రమల నుంచి కథానాయికలు గొంతెత్తుతున్నారు. తాజాగా టాలీవుడ్ కూ ఓ కమిటీ అవసరమని సమంత విజ్ఞప్తి చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సమంత లాంటి స్టార్ కథానాయిక ఈ విషయంపై స్పందించడం, గొంతు విప్పడం కొత్త పరిణామం.
జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక చూసి మలయాళ చిత్రసీమ నివ్వెరబోయింది. కళాత్మక చిత్రాలు తీసే మల్లూవుడ్ లో అమ్మాయిలపై ఇంత అరాచకం జరుగుతోందా? అని నోరెళ్లబెడుతున్నారంతా. అయితే అమ్మాయిలపై లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ మలయాళ చిత్రసీమకే పరిమితం కాదు. అన్ని చోట్లా ఉన్నదే. కానీ… అక్కడ బయటపడ్డారు. ఇక్కడ పడడం లేదు. అంతే తేడా. టాలీవుడ్ లోనూ కాస్టింగ్ కౌచ్ బాధితులు చాలామందే ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఉంది. వీళ్లని సంఘటిత పరచాలంటే.. ఎవరో ఒకరు గొంతు విప్పాలి. జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాలి. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? సమంతలా మిగిలిన కథానాయికలూ బయటకు వచ్చి మాట్లాడతారా? టాలీవుడ్ కూ హేమా కమిటీ లాంటిది కావాలని డిమాండ్ చేస్తారా? అసలు ప్రభుత్వాలే.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సినిమా సెట్స్లలో అమ్మాయిలకు కనీస గౌరవం దక్కుతుందా? వాళ్ల హక్కుల్ని కాలరాస్తున్నారా? వాళ్లకు అందాల్సిన సౌకర్యాలు అందుతున్నాయా? లైగింక వేధింపుల మాటేమిటి? అనే విషయాల్లో లోతైన చర్చ ఇక్కడ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఒకరిద్దరు కథానాయికలు మా బాధలు ఇవీ.. అని ధైర్యంగా బయటకు చెప్పుకొంటే మరింతమంది తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకొస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే, తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి మీడియా ముందుకే రావాల్సిన అవసరం లేదు. వాళ్ల చేతుల్లో సోషల్ మీడియా ఉంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాల ద్వారా తమ సమస్యని చెప్పుకొంటే.. దానిపై తప్పకుండా చర్చ జరుగుతుంది.
అన్నింటికంటే అరాచకం ఏమిటంటే జూనియర్ ఆర్టిస్టుల వేదన. వాళ్లని మలయాళ చిత్రసీమలో బానిసలుగా ట్రీట్ చేస్తున్నారని, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదని హేమ కమిటీ తన రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొంది. ఎండల్లో గంటల తరబడి నిలబెడతారని, షాట్ గ్యాప్ లో వాళ్లకు మంచి నీళ్ల లాంటి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వరని, షూటింగ్ లో గాయమైతే ఎవరూ పట్టించుకోరని నివేదిక నిగ్గు తేల్చింది. అమ్మాయిలకు ఒకలా, అబ్బాయిలకు మరోలా జూనియర్ ఆర్టిస్టులకు వేతనాలు చెల్లిస్తారు. ఈ విషయంలో శ్రమ దోపిడీ స్పస్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి కాస్త నయం అనే చెప్పొచ్చు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ల భద్రత కోసం అహర్నిశలూ కష్టపడుతోంది. అయితే వేతనాల విషయంలొ అన్యాయం జరుగుతోంది. మీడియేటర్లకు కమీషన్ రూపంలో వచ్చే రాబడికి కోత పడుతోంది. దాంతో పాటు జూనియర్ ఆర్టిస్టు కార్డు కావాలంటే రూ.25 వేల రుసుము చెల్లించాల్సి వస్తోంది. రోజుకి రూ.500, 700 సంపాదించే వాళ్లకు పాతిక వేలంటే కష్టమే. ఈ రుసుము విషయంలో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాస్త కనికరం చూపించాల్సి వుంది. అంతే కాదు.. మీడియేటర్ల కమీషన్ పై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి.