శర్వానంద్ నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకి డివైట్ టాక్ వస్తోంది. ఈ సినిమాని ఆడవాళ్లే రక్షించాలని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఫ్యామిలీఆడియన్స్ వస్తే తప్ప, ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర గట్టెక్కదు.
నిజానికి ఇది శర్వానంద్ కోసం రాసుకున్న కథ కాదు. వెంకటేష్ తో తీయాల్సిన సినిమా. నేను శైలజ తరవాత.. వెంకీ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రావాలి. టైటిల్ కూడా ఇదే. అప్పట్లో అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తరవాత శర్వానంద్ దగ్గరకు చేరింది. ఫ్యామిలీ డ్రామాలు వెంకీకి బాగా సూటవుతాయి. ఆ అమాయకత్వం, అందులోంచి పుట్టుకొచ్చే వినోదం.. తను బాగా చేయగలడు. కాకపోతే… పెళ్లి కాని యువకుడిగా, పెళ్లి చూపులకు వెళ్లి రిజెక్ట్ అవుతున్న కుర్రాడిగా, అత్తని బుట్టలో వేసుకోవాలని చూసే హీరోగా.. వెంకీ ఏమాత్రం సెట్టవ్వడు. `మల్లీశ్వరి`లో పెళ్లి కాని ప్రసాద్..పాత్ర దాదాపుగా ఇలాంటిదే. అందుకే వెంకీ కూడా ఈ కథని రిజెక్ట్ చేసి ఉంటాడేమో…? కొంతమంది హీరోలు కథలు నచ్చితే, అటూ ఇటూ ఎడ్జిస్ట్ చేసుకుని, రంగంలోకి దిగిపోతారు. వెంకీ కూడా అలానే చేసుంటే, ఈ ఆడవాళ్లు ఎలా ఉండేవారో..?