వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి..తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకునేందుకు పని గట్టుకున మరీ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ను కాపు రిజర్వేషన్లపై వ్యతిరేక కామెంట్లు చేయడం, పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం, వంగవీటి రాధాకృష్ణను.. అవమానించి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేయడం .. లాంటివన్నీ ఈ కోవకే వస్తాయి. జగన్ కావాలనే.. ఈ విధంగా వ్యవహరిస్తున్నారా..? కాపు సామాజికవర్గం ఓట్లు తనకు వద్దనుకున్నారా..?
2014లో తనకు ఓట్లేయలేదని కక్ష కట్టారా..?
2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవుతానని గట్టిగా అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి.. టీడీపీకి మద్దతివ్వడంతోనే ఆ అవకాశాన్ని కోల్పోయానని భావిస్తూ ఉంటారని వైసీపీ నేతలు చెబుతూంటారు. అదే సమయంలో.. తన తండ్రి వైఎస్ వల్ల కాపు సామాజికవర్గం భారీగా లాభపడిందని.. వారంతా తనకు మద్దతిచ్చి తీరాల్సిందేనన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలా లాభ పడినా… తనకు మద్దతు ఇవ్వనందున.. ముఖ్యమంత్రి కాలేకపోయానని… అందుకే వారి వర్గం ఓట్లు తనకు వద్దన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. గత ఎన్నికల్లో అధికారం పోయినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి.. పార్టీలో ఉన్న కీలక కాపు నేతలందరూ బయటకు వెళ్లిపోయేలా వ్యవహరించారు. జ్యోతుల నెహ్రూ నుంచి వంగవీటి రాధా వరకూ వీరి జాబితా చాలా పెద్దదే. ఇప్పుడు వైసీపీలో.. జనబలం ఉన్న కాపు నేత ఒక్కరంటే ఒక్కరూ లేరు.
జ్యోతుల నుంచి వంగవీటి వరకూ అందరికీ పొగెందుకు పెట్టారు..?
వైసీపీఎల్పీ ఉప నేతగా.. సీనియర్‌గా ఉన్న జ్యోతుల నెహ్రూను తన పక్కన కూర్చోవద్దని.. జగన్ మొహం మీదే చెప్పేశారు. పార్టీ కోసం కష్టపడినా… వంగవీటి రాధాకు టిక్కెట్ కన్ఫర్మ్ చేయలేదు. రాష్ట్రం మొత్తం కాపు సామాజికవర్గం ప్రభావం చూపించగల స్థాయిలో ఉన్న వంగవీటి విషయంలో జగన్ వ్యవహరించిన తీరు చాలా మందిని ఆశ్చర్య పరిచింది. కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం… సీనియర్ నేతలను కూడా ఆశ్చర్య పరిచింది. వంగవీటి రాధాను పిలిచి ఓ సారి మాట్లాడి.. వేరే చోట పోటీ చేయమంటే.. కచ్చితంగా అంగీకరించి ఉండేవారని.. కానీ.. జగన్ .. కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలేదని చెబుతున్నారు.
కాపుల్ని దూరం చేసుకోవడం వ్యూహమా..?
ఇక పవన్ కల్యాణ్‌తో ఆయన వ్యవహరించిన తీరు మరింత తేడాగా ఉంది ఆయనపై పెళ్లిళ్ల పేరుతో వ్యక్తిగత విమర్శలు పదే పదే చేశారు. కాపు రిజర్వేషన్ల పేరుతో వ్యతిరేకంగా మాట్లాడారు. ఇదంతా వ్యూహం అని.. వైసీపీ నేతలు సర్దిచెప్పుకుంటున్నారు కానీ… ఓ వర్గం ఓటర్లు మొత్తాన్ని దూరం చేసుకోవడం.. వ్యూహం ఎలా అవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి జగన్మోహన్ రెడ్డే తనకు తాను సమాధానం వెదుక్కోవాలేమో..?