ప్రత్యేకహోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఇంత వరకూ ఆమోదం పొందలేదు. ఇప్పటికే రెండు సార్లు స్పీకర్ వ్యక్తిగతంగా ఎంపీలతో మాట్లాడినా… నిర్ణయం తీసుకోలేదు. ఐదారు తేదీల్లో మరోసారి సమావేశమై… రాజీనామాలు ఆమోదించుకునే అవకాశం ఉంది. కానీ దీనిపైనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ఎంపీలు.. ఉపఎన్నికలు రాకుండా.. బీజేపీతో కుమ్మక్కయి… రాజీనామాల ఆమోదాన్ని వాయిదా వేయించుకున్నారని టీడీపీ నేతల ఆరోపణ. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపఎన్నికలు తమకు ఏ మాత్రం మేలు చేయవని వైసీపీ నేతలు భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకహోదా కోసం.. పోరాడామన్న పేరు… పదవులు త్యాగం చేశామన్న భావన ప్రజల్లోకి వెళ్తే.. వచ్చే ఎన్నికలకు ఎలాగోలా దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవచ్చన్న ఉద్దేశంతో జగన్… ఎంపీల రాజీనామాలకు వ్యూహం చేశారు. కానీ ఉపఎన్నికలు మాత్రం వద్దనుకున్నారు.
నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు బలపడింది… ఉపఎన్నికలపైనే. కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని పెట్టుకున్న జగన్… సెంటిమెంట్‌ను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు ఉపఎన్నికలను ఓ అస్త్రంగా వాడుకున్నారు. 2011లో తాను పార్టీ పెట్టుకున్న తర్వాత తన వెంట కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వస్తామని చెప్పినా… ముందస్తు వ్యూహం ప్రకారం కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఉపఎన్నికలు వచ్చేలా చేసుకున్నారు. వైఎస్ మరణం సానుభూతి పవనాలను… అత్యంత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో తిరుగులేని మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత 2014 ఎన్నికల వరకూ.. ఈ సానుభూతి పవనాలతో.. గెలుపు సాధించేందుకు పక్కా వ్యూహ రచన చేశారు. మధ్యలో కొంత మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు తెచ్చారు. అందులోనూ… భారీ మెజార్టీలతో విజయాలు అందుకున్నారు. ఈ ఉపఎన్నికల ఫలితాలతోనే జగన్ 2014లో ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఉపఎన్నికల్లో గెలిచిన సీట్లలోనే సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం పాలైంది.
ఏ విధంగా చూసినా ఉపఎన్నికలు అంటే.. జగన్ హాట్ ఫేవరేట్ అనుకోవాలి. కానీ ఇప్పుడు ఆ ఉపఎన్నికలకే జగన్ భయపడుతున్నారు. తన పార్టీకి ఉపఎన్నికలు కలసి వస్తాయన్న అంచనాతోనే… నంద్యాలలో.. భూమా నాగిరెడ్డి కుటుంబంపై పోటీకి సిద్దపడ్డారు. ఏ పార్టీ అధినేత కూడా.. ఉపఎన్నికల కోసం పదహారు రోజులు ప్రచారం చేయరు. కానీ జగన్ చేశారు. అయినా పరాజయం పాలయ్యారు. దీంతో జగన్ సామర్థ్యంపై అనుమానంతో పాటు… వచ్చే సాధారణ ఎన్నికలలో వైసీపీ పరిస్థితిపై సందేహాలు ప్రారంభమయ్యాయి. ఈ భయం కారణంగానే జగన్ ఉపఎన్నికలకు భయపడుతున్నారన్న అంచనాలున్నాయి.
ఉపఎన్నికలు రావన్న విషయాన్ని వైఎస్ జగన్ కూడా ఇన్‌డైరక్ట్‌గా అంగీకరిస్తున్నరు. అందుకే రాజీనామాలు ఆమోదం పొందని అంశంలో.. తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో టీడీపీ కుమ్మక్కై… ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందకుండా అడ్డుపడ్డారంటున్నారు. మొత్తానికి జగన్… తన ఎంపీల రాజీనామాల విషయంలోనూ..టీడీపీపైనే నిందలేస్తున్నారు.