జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయిన తరువాత నుంచి వైకాపా గ్రాఫ్ ఏమంత ఆశాజనకంగా లేదనే అంచనాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్యంగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పెన్షన్లు రెండింతలు చేయడం, మహిళలకు పసుపు కుంకుమ, రైతులకు సాయం… ఇలా వరుసగా కొన్ని పథకాలను అమల్లోకి తెచ్చారు. దీంతోపాటు రాయలసీమ ప్రాంతానికి సాగునీరు వెళ్లడం, పోలవరం పనుల్లో రికార్డులు నమోదు కావడం, కియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించడం, పేదలకు పెద్ద సంఖ్యలో సొంత ఇళ్లను నిర్మించి ఇవ్వడం… ఇవన్నీ టీడీపీ పాలనలో విజయాలు ఒక్కసారి కనిపించాయి. కేంద్ర సాయం లేకపోయినా, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సమర్థంగా నడిపించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టం ఫలితాలను ఇస్తోందన్న నమ్మకం ప్రజల్లో మరింత బలపడింది. దీంతో ప్రతిపక్ష పార్టీ వైకాపాకి దిక్కుతోచని పరిస్థితి! టీడీపీ మీద ఏ విమర్శలు చేసి ప్రజల్లోకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి.
అందుకే, ఈ మధ్య ఏదో ఒక అంశంతో రచ్చ చేయాలని వైకాపా నేతలతోపాటు, వారి పత్రిక సాక్షి రకరకాల కథనాలు వండి వారుస్తూ వస్తోంది. కానీ, ఆశించిన స్థాయి చర్చ ప్రజల్లో జరగడం లేదు. దీంతో తాజాగా ఈ డాటా చోరీ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. ప్రజలందరికీ సంబంధించినది ఏదో టీడీపీ కాజేసిందనే చర్చకు బాకాలు ఊదుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఏదో ఏమార్చేసిందన్నట్టుగా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు డాటా చోర్ అంటూ, గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల జాబితా చోరీ అయిందనీ, దాని వల్ల ఏదో ఘోరమైన నేరానికి పాల్పడిందనే ఆరోపణలు వైకాపా చేస్తోంది. ఇవాళ్టి సాక్షి పత్రిక కూడా అదే తరహా కథనాలతో నింపేసింది! అయితే, ఈ రచ్చ అంతా టీడీపీ దృష్టిని మార్చడం కోసం, ప్రజల దృష్టిలో టీడీపీని దొంగ అని ముద్రవేసే ప్రయత్నం అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థం అవుతూనే ఉంది.
ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలకూ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్ సైట్ లో వివరాలన్నీ అందరికీ కనిపిస్తాయి. కాబట్టి, ఓటర్ల జాబితా మీద గోప్యత పేరుతో విమర్శలు చేయడం అనేది అసందర్భమైన పని. ఇంకోటి… డాటా చోరీ అయిందీ అయిందీ అంటూ తెలంగాణ నేతల నుంచి, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వరకూ అందరూ ఏపీ సర్కారును విమర్శిస్తున్నారు. అయితే, ఆ డాటా ఎక్కడైనా దుర్వినియోగమైందా..? ఆ వివరాలతో ప్రజలను ఎవరైనా మభ్యపెడుతున్నారా..? సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను పెట్టుకుని ఏ అధికార పార్టీ అయినా ఏం చెయ్యగలదు..? మహా అయితే వారికి ఫోన్లు చేసి, మెసేజ్ లు ఇచ్చి… తమ పార్టీకి ఓటెయ్యండి అని మాత్రమే కోరగలదు. ఏ రకంగా చూసుకున్నా డాటా చోరీ వివాదం కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ఒక ప్రచారంశంగా మాత్రమే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలును, సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న ముఖ్యమంత్రిని డైవర్ట్ చేయడమే వైకాపా, దానికి వెనకున్న తెరాస, వీరికి అండగా నిలిచేందుకు అవకాశం ఉన్న మరో పెద్దన్న పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందనేది కొంతమంది విమర్శ.