తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ పగ్గాలు ఎవరికి అప్పగించాలి అనే విషయంలో అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలించిన హైకమాండ్..రేవంత్ తరహలో పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అన్న దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతోంది.
మహేష్ కుమార్ గౌడ్ వైపు రేవంత్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ , ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ , అడ్లూరి లక్ష్మణ్ , ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ లు రేసులో ఉన్నారు. అయితే, వీరిలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగించినా..సీనియర్, జూనియర్ నేతలను సమన్వయం చేసుకొని రేవంత్ లాగా పార్టీని నడిపించగలరా..? అని కాంగ్రెస్ అధిష్టానం మరోసారి సమాలోచనలు మొదలు పెట్టింది.
ఈ నేపథ్యంలోనే అందర్నీ కలుపుకుపోయే సీనియర్ నేత, మంత్రి శ్రీధర్ బాబుకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీధర్ బాబు అయితేనే పార్టీ నేతలను సమన్వయం చేయగలడని హైకమాండ్ భావిస్తుండటంతో పీసీసీ ఎంపిక మళ్లీ మొదటికి వచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే, ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వగా, ఇప్పుడు పీసీసీ బ్రాహ్మణ వర్గానికి ఇస్తే బీసీల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం శ్రీధర్ బాబు – మహేష్ కుమార్ గౌడ్ లలో ఒకరికి పార్టీ పగ్గాలను అప్పగించాలని అధిష్టానం భావిస్తోందని గాంధీ భవన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.