ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబ ఆదాయం కేవలం 19వేల రూపాయలు. కానీ రూ. కోటి అరవై లక్షల నగదు ఇచ్చి కుటుంబీకులు భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఐటీ శాఖ ఈ విషయంలో రంగంలోకి దిగింది. అంత డబ్బు పెట్టి భూములు కొన్నారు.. అసలు డబ్బులెక్కడివో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. మంత్రి సతీమణి రేణుకకు ఈ నోటీసులు ఉందాయి.
కర్నూలు జిల్లా అస్పరిలో మొత్తం 180 ఎకరాల భూమిని మంత్రి జయరాం భార్య రేణుకతో పాటు కుటుంబసభ్యులు ఒకే రోజు కొన్నారు. ఒకే రోజున మంత్రి భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయ్యాయి. 180 ఎకరాలు కొనుగోళ్లు చేసింది మంత్రి బినామీలేననే ఐటీ శాఖ నోటీసుల్లో స్పష్టం చేసింది. 180 ఎకరాలను సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. 90 రోజుల్లోగా భూ కొనుగోళ్ల లావాదేవీలకు సంబంధించిన ఆదాయ వివరాలను అందించాలని ఐటీ విభాగం స్పష్టం చేసింది.
ఈ భూముల వ్యవహారం కొద్దిది కాదు. గతంలోనే బయటపడింది. మంత్రి జయరాం నియోజకవర్గంలో ఇట్టినా అనే కంపెనీకి 450ఎకరాల భూమి ఉంది. ఆ కంపెనీలో కొంతకాలం డైరెక్టర్గా ఉండి.. 2009లోనే వైదొలగిన మంజునాథ్ అనే వ్యక్తి సాయంతో .. మంత్రి జయరాం కుటుంబీకులు భూములు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయిన తర్వాత ఇట్టీనా కంపెనీ యజమానులు.. మోసం జరిగిందని గుర్తించి కర్ణాటకలోని కోరమంగళం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి సతీమణి రేణుక తో పాటు మరో నలుగురి పేర్లను అందులో కేసులో నిందితులుగా చేర్చారు. తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి తమ భూమి కాజేశారని వారు చెప్పడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇప్పుడు అసలు ఆ భూములు కొనడానికి డబ్బులెక్కడివో చెప్పాలని ఐటీఅధికారులు అడుగుతున్నారు. సోర్స్ చెప్పకపోతే.. ఆ భూముల్ని జప్తు చేస్తారు. చెబితే అవినీతి అని విపక్షాలు వెంటపడతాయి.