తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే అదే నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కేఎల్ఆర్ గా ప్రసిద్ధుడైన కిచ్చెన్నారి లక్ష్మారెడ్డి గతంలో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి సబితా ఇంద్రారెడ్డిపై పోటీకి కాంగ్రెస్ టిక్కెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన రంగంలోకి దిగి ప్రచారం ప్రారంభించారు. ఈ లోపు ఐటీ దాడులు జరుగుతున్నాయి.
మామూలుగా అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కువ ధన ప్రవాహం చేస్తాయి. కానీ దాడులు మాత్రం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై జరుగుతూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు, అభ్యర్థులపై ఒక్క సారి కూడా ఐటీ అధికారులు దాడుల చేయలేదు. తమపైనే దాడులు చేస్తున్నారని.. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయనడానికి ఇంత కంటే నిదర్శనం ఏముంటుంగని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలయ్యే వరకూ కాంగ్రెస్ పార్టీకి నిధులు అందకుండా పూర్తి స్థాయిలో కట్టడి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో కర్ణాటకలో జరిగిన ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ము కాంగ్రెస్ దేనని ప్రచారం జరిగింది. అదేమయిందో కానీ.. కాంగ్రెస్ అభ్యర్థులపై పూర్తి స్థాయిలో నిఘా ఉందని స్పష్టమవుతోంది.