నిస్సందేహంగా తెలుగు చిత్రసీమ అందించిన మంచి డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకడు. రైటర్‌గా పూరికి తిరుగులేదు. అదే దర్శకుడిగా నిలబెట్టింది. తన రాత, హీరోయిజం, కథని నడిపించే విధానం ఇవన్నీ ఓ కొత్త ట్రెండ్ సృష్టించాయి. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పూరిని చూస్తుంటే జాలేస్తుంది. ఇదివరకటి స్పార్క్ ఏమైపోయిందా? అనిపిస్తుంది. లైగర్ ఫ్లాప్ తరవాత ‘ఒళ్లు దగ్గర పెట్టుకొని తీసిన సినిమా ఇది’ అని పూరి కాస్త వినయంగానే చెప్పాడు. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ చూస్తే.. పూరి ఏం మారలేదని, ‘లైగర్’ తనకేం కొత్త పాఠాలు నేర్పలేదని అనిపిస్తోంది.
సినిమా నడకని మార్చిన దర్శకుల్లో పూరి ఒకడు. కానీ ఇప్పుడు సినిమా మరింత మారింది. తను ఇంకా బద్రి, ఇడియట్ రోజుల్లోనే ఉండిపోయాడు. సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ్లు సినిమాలకు ఓ కొత్త అర్థాన్ని చెప్పారు. ఆ ఫ్లోని పూరి లాంటి వాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా హీరోలు హీరోయిన్ల వెంట పడడాలూ, సెపరేట్ కామెడీ ట్రాకులు, ఐటెమ్ గోలలూ అంటూ అక్కడే ఉండిపోతే.. పూరికి ఇలాంటి ఫలితాలే మళ్లీ మళ్లీ వస్తుంటాయి.
కథల విషయంలో పూరి నిర్లక్ష్యంగా ఉంటాడు. తన హిట్లకు కారణం కథలు కావని, తాను చూపించిన హీరోయిజమని గట్టిగా నమ్ముతాడు పూరి. అందుకే ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ కథల విషయంలోనూ ఇలానే వ్యవహరించాడు. పూరి దగ్గర కథలకు కొరతేం ఉండదు. తన దగ్గర కథల బ్యాంకే ఉందని పూరినే చెబుతుంటాడు. కానీ ఆ కథలకు కాలదోషం పట్టింది. పూరి పాత ఆలోచనల్లోంచి బటయకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. కొంతకాలమైనా పూరి తన కథల్ని పూర్తిగా పక్కన పెట్టాలి. `టెంపర్` తన కథ కాదు. కానీ హిట్. ఇలా కొన్నాళ్లయినా పూరి బయటి కథల్ని ఓన్ చేసుకొని, సినిమాలు తీయాలి. లేదంటే… ప్రస్తుత ట్రెండ్ ని అర్థం చేసుకొని, తదనుగుణంగా కథలు రాసుకోవాలి.
”నువ్వు కథ రాసి, సినిమా తీసే ముందు నాకు వినిపించు” అని విజయేంద్ర ప్రసాద్ లాంటి రచయిత ఆఫర్ ఇచ్చినా, పూరి వాడుకోలేదు. కనీసం తన కథల్లో తప్పొప్పులేమిటో చెప్పగలిగే రచయితల్నయినా పూరి పక్కన పెట్టుకోవాలి. ‘నేను రాసిందే కథ, తీసిందే సినిమా..’ అనుకొంటే మాత్రం పూరికి ఇలాంటి పరాభవాలు తప్పవు.