ధర్మవరంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సభ జరిగింది. చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారంటూ విమర్శించారు. నేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తానన్నారనీ, ఎంతమందికి రుణమాఫీ అందిందో రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా లేదని చెప్పమని కోరారు! ‘కార్మిక కుటుంబాలకు తక్కువ వడ్డీకే రూ. లక్ష రుణం ఇప్పిస్తామని చెప్పారు. మీలో ఎంతమందికి ఆ రుణాలు అందాయో అనేది చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా చెప్పండీ’ అని జగన్ అన్నారు. ‘ప్రతీ చేనేత కుటుంబానికీ ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు చెప్పారనీ, ఎంతమందికి ఇల్లు దక్కాయనేది ఇలా ఇలా ఇలా చేతులు పైకెత్తాలి’ అన్నారు. ‘చేనేత కార్మికులకు ఏడాది రూ. వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానన్నారు. ఇవాళ్ల నేను అడుగుతా ఉన్నా.. ఆ సొమ్ము ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా’ అనాలని జగన్ చెప్పారు. ‘జిల్లాకో చేనేత పార్కు అన్నారు. అనంతపురంలో చేనేత పార్కు కనిపిస్తోందా..? రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా’.. ‘అందరికీ బీమా సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇవాళ్ల మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇచ్చారా.. రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా’… ఇలా కొంతసేపు ‘ఇలా ఇలా ఇలా’లకే సరిపోయింది.
చంద్రబాబు నాయుడు పాలన పోయే రోజు దగ్గర్లో ఉందనీ, ఒక్క సంవత్సరం.. ఆ తరువాత అందరం కలుద్దాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం అన్నారు. ఒక సంవత్సరంలో ‘ఒక మంచి అన్నయ్య’ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడన్నారు. మీ ‘అన్న ముఖ్యమంత్రి అవుతాడూ’ నలభై అయిదేళ్లకే పెన్షన్ ఇస్తాడూ, వెయ్యి కాదు ఏకంగా రూ. 2 వేలు ఇస్తాడూ అంటూ జగన్ చెప్పారు. నాలుగేళ్ల అవుతున్నా పేదలకు పక్కా ఇళ్లు కనిపించడం లేదనీ, ‘అన్న ముఖ్యమంత్రి ’అవుతాడని దేవుడిని గట్టిగా ప్రార్థన చేయండనీ, మన ప్రభుత్వం వచ్చాక 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని జగన్ అన్నారు. ప్రతీ చేనేత కుటుంబానికి లక్ష రూపాయాలు వడ్డీలేని రుణం ఇప్పిస్తాననీ, ‘మీ అన్న ముఖ్యమంత్రి’ కావాలని దేవుడిని గట్టి ప్రార్థించండి అని మళ్లీ కోరారు! అందరినీ మరో సంవత్సరం ఓపిక పట్టమంటూ ప్రజలను జగన్ కోరారు. ఇలా అన్న ముఖ్యమంత్రి కావాలీ కావాలీ అని పదేపదే జగన్ చెప్పారు!
జగన్ ప్రసంగం ఎలా ఉందంటే… ఎన్నికల ప్రచార సభలా ఉంది. పైగా, ఎంతసేపూ ‘అన్న ముఖ్యమంత్రి కావాలీ, దేవుడిని ప్రార్థించండీ’ అంటూ ప్రజలను కోరడం మరీ విడ్డూరంగా ఉంది. ఏడాది ఓపిక పట్టాలని ప్రజలు కోరుతున్నారుగానీ.. ఆయనకు ఆ మాత్రం కూడా ఓపిక లేనట్టుగా ధ్వనిస్తోంది. అడుగడుగునా ఆయన వ్యక్తిగత పదవీ కాంక్షే ఈ ప్రసంగంలో ప్రస్పుటంగా కనిపిస్తోంది. చేనేత సమస్యలు, రైతుల సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు.. ఇలా అన్నింటికీ ఒకే ఔషధం.. జగన్ ముఖ్యమంత్రి కావమే అన్నట్టుగా ఉంది. చంద్రబాబు సర్కారు వెయ్యి పెన్షన్ ఇస్తే, తాను రెండు వేలు ఇస్తానంటున్నారు! ఆయన యాభై ఏళ్లకు పింఛెన్లు ఇస్తుంటే… ఈయన 45 ఏళ్లకే ఇచ్చేస్తారట! ఆయన తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తే… ఈయన వడ్డీలు లేకుండానే అప్పులు ఇచ్చేస్తారట! జగన్ ప్రసంగం అంతా కేవలం భావోద్వేగపూరితంగానే కొనసాగింది. కేవలం తాను ముఖ్యమంత్రి కావాలీ, తానే ముఖ్యమంత్రి కావాలీ అని ఓపెన్ గా చెబుతూ ఉన్నట్టే సాగింది. గడచిన మూడేన్నరేళ్లపాటు ఆయనా ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా… ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే కేవలం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే తప్ప సాధ్యం కాదా..? చంద్రబాబుపై ద్వేషాన్ని వెళ్లగక్కడమే జగన్ మోహన్ రెడ్డి ప్రచాస్త్రం అన్నట్టుగా మారుతోంది. ఇది ఆత్మవిశ్వాసమో.. అతి విశ్వాసమో వారికే తెలియాలి మరి!