విశాఖ భూ కుంభకోణంపై ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సేవ్ వైజాగ్ పేరుతో విశాఖపట్నంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… వైజాగ్ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోపాటు ఆయన కుమారుడు లోకేష్, ఇతర సన్నిహితులకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. విశాఖ భూదందాపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు అసలు రంగు బయటపడుతుందని భయపడుతున్నారన్నారు. సీబీఐ విచారణకు దిగితే చంద్రబాబు కుటుంబం 20 సంవత్సరాల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ‘ఈ కుంభకోణం చేసిందే నువ్వు, నీ కుమారుడు. దీన్లో మంత్రులూ రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు దీనిపై విచారణకు కూడా నీ కింద పనిచేసేవారినే నియమిస్తే వాస్తవాలు ఎలా బయటకి వస్తాయి’ అంటూ ప్రశ్నించారు.
పెద్దవాళ్లతో కుమ్మక్కై పేదవాళ్లను దోచుకోవడమే నారా చంద్రబాబు విధానంగా మారిందని జగన్ ఆరోపించారు. విశాఖ ప్రజలు తెలుగుదేశం పార్టీకి చాలా ఇచ్చారనీ, కానీ చంద్రబాబు మాత్రం విశాఖకు అవినీతి తిరిగి ఇచ్చారన్నారు. ప్రభుత్వం అండతో దోపడీదారులకు అనుమతులు ఇచ్చారన్నారు. ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగితే ముఖ్యమంత్రి తాట తీస్తాడనే భయం అందరిలోనూ ఉండాలనీ, కానీ ఇక్కడ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అవినీతికి దిగుతుంటే ఎవరు భయపడతారని జగన్ అన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు మాత్రమే కాదు, సీఎం కుమారుడు లోకేష్ కీ, కొంతమంది రెవెన్యూ అధికారులకు కూడా వాటాలున్నాయన్నారు. ఇదంతా ఒక మాఫియా ఏర్పాటై ఓ ప్లాన్ ప్రకారం విశాఖను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం వీరిని ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో అందరం ఉన్నామనీ, మరో ఏడాదిన్నరలో వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ చెప్పారు. మనం అధికారంలోకి వచ్చిన ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతెంత తిన్నారో మెడలు వచ్చి కక్కిద్దాం అని భరోసా ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.
ప్రతీసారీ జగన్ తో వస్తున్న చిక్కు ఇదే..! తాము అధికారంలోకి రావడమే పరిష్కారం అని చెప్తుంటారు. అయితే, విశాఖ భూ కుంభకోణంపై ఇప్పుడు పోరాటం చెయ్యరని చెబుతున్నట్టేగా. అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటారన్నమాట. దీన్ని కూడా మరో ప్రత్యేక హోదా పోరాటం తరహాలోనే డీల్ చేస్తారన్నమాట. జగన్ పోరాటం అంటే, వైకాపా అధికారంలోకి రావడమే అన్నమాట! అంతవరకూ అందరూ వెయిట్ చేయాల్సిందేనా? ఈ మధ్య కాలంలో జగన్ మాట్లాడుతున్న ప్రతీ అంశంలోనూ ఇదే కంటెంట్ ఉంటోంది. ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారం చూపించవయ్యా, పోరాటం చెయ్యవయ్యా అంటే… ఎప్పుడో అధికారంలో వచ్చే వరకూ ఆగండీ, అప్పుడు అద్భుతంగా చర్యలు తీసుకుంటా చెబుతున్నారు. ఈలోగా ప్రతిపక్షం పోరాటం ఏదీ..? ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఏదీ..? పోరాటాన్ని పోస్ట్ పోన్ చేయడమంటే.. ఇలాంటి దందాలకు దన్ను ఇస్తున్నట్టు కూడా ధ్వనిస్తుందిగా!