మూడు పెళ్లిళ్ల వల్ల మంచి జరుగుతుందని చేసుకోవాలని పవన్ కల్యాణ్ చెబుతున్నారని … జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. పవన్ తన పెళ్లిళ్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను జగన్ ఇలా అన్వయించుకుని… కృష్ణా జిల్లాలో జరిగిన బహిరంగసభలో తిప్పికొట్టారు. ఇలా అందరూ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మన వ్యవస్థ ఏమైపోవాలని జగన్ బాధపడ్డారు. మూడు రాజధానుల వల్ల మేలు జరుగుతుందని తానంటే.. మూడు పెళ్లిళ్ల వల్ల మేలు జరుగుతుందని వారంటున్నారని చెప్పుకొచ్చారు. అందరూ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే అక్క చెల్లెళ్ల మాన ప్రాణాలు ఏమైపోవాలని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులా మనకు దశా దిశా చూపేదని ప్రశ్నించారు. దత్త తండ్రి ప్రోత్సాహంతో దత్త పుత్రుడు ఎలా మాట్లాడుతున్నారో చూశామని.. చెప్పులు చూపిస్తూ వీధి రౌడీలా మాట్లాడుతున్నారన్నారు.
పవన్ పెళ్లిళ్లు చేసుకోమని ప్రజలకు చెప్పాడా ? ఇదేం వక్రీకరణ ?
అన్ని విషయాలు వదిలేసి పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటం.. ఆయన పెళ్లిళ్ల వల్ల రాష్ట్రానికి ఏదో జరిగిపోతుందని జగన్ బాధపడటం చూసి … సభలోని వారే ఆశ్చర్యపోయారు. పవన్ పెళ్లిళ్ల వల్ల ఇంత నష్టం జరుగుతుందని తెలియదే అని కాసేపు ఆలోచించుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఒక్క జగన్ ను కొట్టడానికి అందరూ ఏకమవుతున్నారని సెంటిమెంట్ ప్రయోగం కూడా చేశారు. తనకు చాలా ఆశ్చర్యమేస్తుందని అమాయకత్వ నటించారు. తాను దేవుడిని.. కార్యకర్తలను అక్కచెల్లెమ్మలను నమ్ముకున్నాననన్నారు.
రంకులు అంటగట్టి.. పుట్టుకల్ని ప్రశ్నించిన వారిని ఎప్పుడూ వారించలేదే ?
నిజానికి పవన్ కల్యాణ్ అన్న మాటలతో రాష్ట్రానికి అంత నష్టం జరిగితే.. వైసీపీ నాయకులు అన్న మాటల వల్ల ఇంకెంత నష్టం జరగాలి. కులాలపై విద్వేషాలు రెచ్చగొట్టి, రంకులు అంటగట్టి, పుట్టుకలను ప్రశ్నించి… వినే ప్రజలు కూడా వీళ్లా.. మన నేతలు ఛీ అనుకునేలా చేసిన వైసీపీ నేతల్ని జగన్ ఎప్పుడూ కట్టడి చేయలేదు. కానీ అలా మాట్లాడుతున్న వారిని ఉద్దేశించి పవన్ చెప్పు చూపించగానే జగన్ కు ఏదో జరిగిపోతోందన్న అభిప్రాయం వచ్చేసింది. జనం ముందుకు వచ్చి బాధపడ్డారు.
ప్రభత్వ సభలా ? వైఎస్ఆర్సీపీ బహిరంగసభలా ?
ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లడం.. మీట నొక్కడ.. రాజకీయ ప్రసంగాలు చేయడం కామన్ అయిపోయింది. రాజకీయంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. చేతనైతే ప్రెస్ మీట్ పెట్టుకోవాలి..లేకపోతే పార్టీ బహిరంగసభలో మాట్లాడాలి కానీ ఇలా ప్రభుత్వ కార్యక్రమాల్లో విపక్ష నేతలను టార్గెట్ గా చేసుకుని ప్రసంగించడం ఏమిటన్న విమర్శలు వస్తున్నా..సీఎం జగన్ తగ్గడం లేదు. అయితే మునుపటిలో ఆయన ప్రసంగాల్లో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ప్రతీ పదం చూసుకుని చదవాల్సి వస్తోంది. దీంతో కంటిన్యూషన్ లేక.. ఎంత సీరియస్ కామెంట్లు చేసినా ఒకే ఫ్లోలో ఉంటున్నాయి. ఈ కారణంగా సభికుల్లోనూ పెద్దగా స్పందన కనిపించడం లేదు.