ఏడు నెలల కిందట తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేశారో, ఏపీ ఎన్నికల ఫలితాలపై జగన్ కూడా అదే తరహ ప్రకటనలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించబోతుందని అటు కేసీఆర్, సంబరాలకు సిద్దం కావాలని ఇటు కేటీఆర్ ధీమా వ్యక్తం చేసినా, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించి రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు.
ఇప్పుడు ఏపీలోనూ అచ్చంగా అదేవిధమైన పరిస్థితి కనిపిస్తోంది. విజయం మాదేనని, కార్యకర్తలు అధైర్యపడవద్దని జగన్ తో సహా వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాని క్యాడర్ లో మాత్రం నమ్మకం కలగడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని సర్వేలు తెల్చినప్పుడు కేసీఆర్ ఎలాగైతే కొట్టిపారేశారో, ఏపీలో అధికారం కూటమిదేనని సర్వేలన్నీ స్పష్టం చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని జగన్ రెడ్డి చెప్తుండటం గమనార్హం.
దీంతో, తెలంగాణ తరహాలోనే ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని సోషల్ మీడియాలో ఫలితాలకు ముందు కేసీఆర్ చేసిన కామెంట్స్ ను, తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలను పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.