వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందని టీడీపీ నేతలు మాత్రమే ప్రచారం చేయడం లేదు.. వైసీపీలోనూ ఆ కంగారు కనిపిస్తోంది. సీఎం జగన్ ఈ విషయంలో రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. వింతవైనా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గాలకు.. ఇంచార్జులు.. ఎమ్మెల్యేలు మాత్రమే కాదని… వారికి అదనంగా పరిశీలకుడ్ని నియమించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించాలని.. నిర్ణయించి ఇప్పటికే జాబితారెడీ చేశారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అదనంగా పరిశీలకుడు ఉంటారు.
తుది జాబితా సిద్ధమవుతోందని వారం, పది రోజుల్లో ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిశీలకుడు ఏం చేస్తాడన్నది మాత్రం వైసీపీ వర్గాలు క్లారిటీగా చెప్పలేకపోతున్నాయి. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే.. ఇంచార్జిని ఐ ప్యాక్ టీం ఫాలో చేస్తోంది. వారేం చేస్తున్నారో పరిశీలిస్తోంది. నివేదికలిస్తోంది. అందుకే జగన్… ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడం లేదని కొంత మందిపై మండి పడుతున్నారు. అయితే ఈ సారి నియమంచబోయే పరిశీలకులు.. రాజకీయ నేతలేనని అదే నియోజకవర్గానికి చెందిన వారై ఉంటారని చెబుతున్నారు. అంటే అదనపు ఇంచార్జ్ గా అనధికారికంగా వ్యవహరిస్తారన్నమాట .
అదనపు ఇంచార్జ్ అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అంగీకరించరు. రచ్చ చేస్తారు. ఉండవల్లి శ్రీదేవి విషయంలో జరగింది అదే. అందుకే మభ్య పెట్టేందుకు పరిశీలకుడి పేరు తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఎలా చూసినా వైసీపీలో ఇప్పుడు ఉన్నంత గందరగోళం ఎప్పుడూ లేదని.. గతంలో అనుకున్నట్లుగా పనులు చేసేవారని.. ఇప్పుడు నేతలు అసంతృప్తి చెందుతారని హైకమాండ్ భయపడుతోందని కార్యకర్తలు గొణుక్కుంటున్నారు.