వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ ఐదేళ్ల నుంచి చెబుతున్నారు. మూడున్నరేళ్ల నుంచి చేయగలిగిన స్థానంలో ఉన్నారు. కానీ ఆయనకు ఇంకా ఈ విషయంలో వారం కాలేదు. కానీ ఆయన మాటలు నమ్మిన సీపీఎస్ ఉద్యోగులు మాత్రం రగిలిపోతున్నారు. ఆయన మోసాన్ని తట్టుకోలేక.. ఆత్మహత్యలతో నిరసనలు తెలపాలనుకుంటున్నారు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీపీఎస్ రద్దు కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి నిద్రమాత్రలు మింగాడు. ఈ వ్యవహారం ఉపాధ్యాయవర్గాల్లో సంచలనం అయింది. ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవాలన్న అభిప్రాయానికి వారు వస్తున్నారు.
సీపీఎస్ రద్దు అనేది అసాధ్యమేమీ కాదని ఇటీవల పలు రాష్ట్రాలు నిరూపించాయి. ఇప్పుడు సీపీఎస్‌ను రద్దు చేసుకుని ఓపిఎస్ అమలవుతున్న రాష్ట్రాల సంఖ్య ఐదుకు చేరింది. బీజేపీ వ్యతిరేక పార్టీలు.. సీపీఎస్ రద్దు కోసం హామీలిస్తున్నాయి. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. గుజరాత్‌లోనూ రద్దు చేస్తామని చెబుతోంది. అయితే ఏపీలో మాత్రం అసాధ్యమని ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి కారణం సీపీఎస్ అమలు చేస్తామని చెప్పి అప్పులు తీసుకోవడమే. అప్పులు తీసుకోకపోతే.. సీపీఎస్ రద్దు పెద్ద సమస్య కాదు. అందుకే తీవ్ర స్థాయిలో పోరాడాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
సెప్టెంబర్‌లో జరిగిన సిపిఎస్ వ్యతిరేక ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అణచివేసింది. పెద్ద ఎత్తునకేసులు పెట్టింది. ఈ కాసి కేసులకూ వెనుకాడకూడదన్న అభిప్రాయం ఉద్యోగ సంఘాల్లో ఉంది. సీపీఎస్ రద్దు విషయంలో జగన్ ఘోరంగా మోసం చేశారన్న అభిప్రాయం ఉంది. తెలియక హామీ ఇచ్చామని కవర్ చేసుకోవడంతో పాటు.. కేసులు పెట్టి కంట్రోల్ చేయాలనుకుంటోంది. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు ఇప్పుడు జగన్‌కు సంకటంగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒకటి చేయకపోతే.. ఇబ్బందేనన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. మరేం చేస్తారో ?