ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి.. రెవిన్యూ మంత్రి వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఇద్దరూ ఒకటే మాట్లాడితే ఏ సమస్యా ఉండదు. కానీ ఇద్దరూ వేర్వేరుగా ప్రకటిస్తున్నారు. మంత్రి ధర్మాన చట్టం అమలు చేయట్లేదని ప్రెస్ మీట్ పెట్టి చెబితే… తాము అమలు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. దీంతో ఈ చట్టం విషయంలో మరింత గందరగోళం ఏర్పడింది.
పాయకరావుపేట ఎన్నికల సభలో మాట్లాడిన జగన్.. తాను భూములు లాక్కోనని..పంచుతానని ప్రకటించారు. ఎక్కడి నుంచి తెచ్చి పంచుతారో చెప్పలేదు. అసైన్డ్ ల్యాండ్స్ లాక్కుని సెంట్ స్థలాల పేరుతో చేసిన రాజకీయం గురించి కళ్ల ముందే ఉంది. వందేళ్ల నుంచి భూ వివాదాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేలా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏ వివాదం లేకండా అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ ప్రకటనతో .. సామాన్య జనంలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంంటే రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాము చట్టాన్ని అమలు చేయడం లేదని హోల్డ్ లో పెట్టామంటున్నారు. ఇప్పుడు ధర్మాన చెప్పింది కరెక్టా.. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా అన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
మరో వైపు కొంత మంది ఇది కేంద్ర ప్రభుత్వ చట్టమని.. బీజేపీ తీసుకొచ్చిందని వాదించడం ప్రారంభించారు. చట్టం కు సంబంధించి కేంద్రం సూచనలే చేసింది. ఇలా అడ్డగోలుగా .. భూములు లిటిగేషన్ పెట్టి దోచుకోవాలని ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ చట్టాన్ని తెచ్చి వేగంగా .. భూముల్నిదోపిడీ చేయాలన్న ప్రణాళిక వేసుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు నిజాలు కూడా చెప్పడం లేదు. ఎవరికి వారికి ఇష్టమైన సమాచారాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. మరింత గందరగోళం ఏర్పర్చుతున్నారు.