మంత్రివర్గాన్ని మార్చాలని జగన్ అనుకుంటున్నారు. స్వయంగా తానే కసరత్తు చేసుకుంటున్నారు. సజ్జల మాటలను కూడా పట్టించుకోవడం లేదు. ఐ ప్యాక్ ఇన్ పుట్స్ కూడా పక్కన పెట్టారు. తానే మంత్రుల్ని పిలిచి మాట్లాడుతున్నారు. ఎవర్ని తీసుకోవాలో కూడా పిలిచి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మంత్రులందరికీ ఉద్వాసన చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. గుడివాడ అమర్నాథ్, బొత్స, ధర్మాన ప్రసాద్, సీదిరి అప్పలరాజు నలుగురికీ ఉద్వాసన పలకాలని కొత్తగా స్పీకర్ తమ్మినేనిని తీసుకోవాలని అనుకుంటున్నారు. మిగతా ఎవర్ని తీసుకోవాలో కసరత్తు చేస్తున్నారు.
సీఎం జగన్ కు విమర్శల పేరుతో బూతులు తిట్టే వాళ్లంటే ఇష్టం. న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అప్పలరాజుకు మంత్రి పదవి వచ్చింది. కానీ ఆయన ఇప్పుడు నచ్చడం లేదు. స్పీకర్ గా ఉంటూ విపక్షంగా చైర్లో కూర్చునే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తమ్మినేని సీతారాం ఇప్పుడు జగన్ కు నచ్చుతున్నారు. మంత్రిగా అయితే ఇలాంటి దూకుడు మరింతగా చూపిస్తారని ఆయనకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. అందుకే పిలిచి మాట్లాడారు. తమ్మినేనితో రాజీనామా చేయిస్తే స్పీకర్ పదవిని ధర్మాన ప్రసాదరావుకు ఇస్తారంటున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ తీరుపైనా సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స అనుకున్నట్లుగా కష్టపడలేదని సీఎం జగన్ భావిస్తున్నారంటున్నారు. అదే సమయంలో గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని కామెడీ చేస్తున్నారు. ఆయన సీరియస్ గా చెబుతున్న మాటలు ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేస్తున్నాయి. ఆయనపైనా వేటు వేయవచ్చని అంటున్నారు. అయితే బొత్స లాంటి సీనియర్ మంత్రిని తప్పించే అవకాశం ఉండదని మరికొందరు భావిస్తున్నారు.
కారణం ఏదైనా కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించిన తర్వాత మంత్రుల్లో దూకుడు తగ్గిపోయింది. దూకుడుగా ఉన్న నేతలకు ఉద్వాసన చెప్పడం.. కొత్తగా మంత్రి అయిన పార్టీ ఆదేశాలు వస్తే తప్ప నోరు తెరిచే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం. అందుకే మళ్లీ సీఎం జగన్ పాత కేబినెట్లో దూకుడుగా ఉన్న మంత్రులను మళ్లీ తీసుకోవాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మూడో తేదీన ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.