ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైరయ్యే లోపు పోస్టింగ్ ఇవ్వడానికి జగన్ రెడ్డి సర్కార్ సిద్దపడటం లేదు. తప్పుడు సస్పెన్షన్లతో సుప్రీంకోర్టు తీర్పును సైతం ధిక్కరించారని క్యాట్ తీర్పు చెపితే.. ఆ తీర్పు మీద మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది కూడా కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈసీ అనుమతి తీసుకోకుండా. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సలహా మేరకు సీఎస్ హైకోర్టులో క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఏబీ వెంకటేశ్వరరావుపై కేసులు పెట్టారు కానీ ఇంత వరకూ అభియోగాలు నమోదు చేయలేదు. సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వలేదు. దీంతో గతంలోనే సుప్రీంకోర్టు సస్పెన్షన్ ను కొట్టి వేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ సస్పెన్షన్ వేటు వేశారు. మరో రెండేళ్ల పాటు ఆయన న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నెలాఖరులో రిటైరవ్వాల్సి ఉంది. నెల రోజుల ముందు ఆయనకు క్యాట్ అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది ప్రభుత్వం.
ఇప్పుడు మరోసారి హైకోర్టుకు వెళ్తున్నారు. అసలు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారని క్యాట్ తీలిస్తే .. హైకోర్టులో పిటిషన్ వేయడం వింతగా ఉందని.. ఇది కోర్టుల్లో మొట్టి కాయలు పడినా.. కాలయాపన చేసి.. ఏబీవీకి పోస్టింగ్ రాకుండా చేసే ప్రయత్నమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు నాలుగో తేదీన వస్తాయి. ఈ నెలాఖరుతో ఏబీవీ రిటైరవ్వాల్సి ఉంది. గురువారం హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు స్టే ఇవ్వకపోతే తక్షణం పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.