విశాఖకు వెళ్లిపోయి పరిపాలన చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని మంత్రులతో చెప్పిస్తున్నారు. రాజధాని అంశం న్యాయస్థానాల్లో ఉంది. తేలకుండా సీఎం జగన్.. తనకు తాను విశాఖ వెళ్లిపోయి .. క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగిస్తే నైతికంగా అంత కంటే దారుణమైన పతనం మరొకటి ఉండదు. ఓ ముఖ్య మంత్రిగా ఉండి వ్యవస్థల్ని గౌరవించడం ప్రధాన లక్షణం. కానీ తాను ఏదో మోనార్క్నన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం అందరికీ ఏర్పడుతుంది. ఇప్పటికే ఆయన తీరుపై ఎన్నో విమర్శలు ఉన్నాయి.
సీఎం ఎక్కడి నుంచయినా పరిపాలించవచ్చని కొత్త కథలు చెబుతున్నారు. నిజమే.. పరిపాలించవచ్చు. కానీ ఓ ముఖ్యమమంత్రి అలా చేయవచ్చా ? నమ్మి ఓట్లేసిన ప్రజలను ఇంత ఘోరంగా అవమానించడానికి సిద్దపడవచ్చా ? సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే రాలేదు. కేంద్రం సహా అన్ని పక్షాలు తమ వాదనలు వినిపించాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. అప్పటి వరకూ రాజధానిని కదిలించడానికి అవకాశం లేదు. అలా చేస్తే కోర్టు తీర్పు ఉల్లంఘన అవుతుంది. ఈ మాత్రం జగన్కు తెలియదా ?
అయితే ఇప్పటి నుంచే వైఎస్ఆర్సీపీ వర్గాలు.. సమర్తించుకునేందుకు వాదనలు సిద్దం చేసుకున్నాయి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి … స్థానిక ఎన్నికలలో విజయమే.. తమ మూడు రాజధానుల విధానానికి ప్రజల మద్దతు లభించిందనడానికి సాక్ష్యమంటున్నారు. ఇదే వాదన ముందు ముందు బలంగ వినిపించే అవకాశం ఉంది. నిజమేంటో ఆయనకు తెలుసు. నిజంగా… ఆయన ప్రజల మద్దతు ఉందని చెప్పుకోవాలనుకంటే… మూడు రాజధానుల అంశంపై ఆయన ప్రజాతీర్పు కోరాలి. అ అజెండా ప్రకారం ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. కానీ అలా చేయడం లేదు.
గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని .. వైసీపీ… జగన్ ఆరున్నొక్క రాగాలతో ఆలపించారు. ఇప్పుడు మూడు అంటున్నారు. చట్ట, న్యాయపరంగా సాధ్యం కాకపోయినా మొండిగా విశాఖ వెళ్లిపోతామంటున్నారు. ఇంత కంటే దారుణమైన పతనం ఏరాజకీయ నేతా చూసి ఉండరు. కానీ జగన్ మాత్రం అక్కడ్నుంచే ప్రారంభించారు.