ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ పొత్తులపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు క్లారిటీ కనిపిస్తోంది కానీ.. మరో వైపు… పైపైన ప్రకటనలు వస్తున్నాయి. అది జరుగుతుందా… లేదా అన్న ఉత్కంఠ రేపుతున్నాయి. ఓ వైపు.. తెలంగాణ రాష్ట్ర సమితితో .. వైసీపీ అధినేత జగన్ దాదాపుగా జట్టుకట్టారు. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమవుతున్నారు. బహుశా విజయవాడలో ప్రకటన చేయవచ్చు. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం ఎటు వైపు ఉంటారు..? మళ్లీ టీడీపీతో జట్టు కడతారా..? అన్ని చర్చ నీయాంశం అవుతోంది.
టీడీపీపై పవన్ కల్యాణ్ సాఫ్ట్ వాయిస్ దేనికి సంకేతం..?
టీఆర్ఎస్, వైసీపీలు కలవడంపై… జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇటీవల కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. దానిని బట్టి చూస్తే.. ఆయన వారితో పాటు కలిసేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది. వైఎస్‌ను, జగన్‌ను తీవ్రంగా ద్వేషించిన టీఆర్ఎస్ ఇప్పుడు.. ఆ పార్టీతో కలిసి వెళ్లడానికి కారణం చంద్రబాబుపై కక్షేనని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అలాగే వైసీపీతో పొత్తు కోసం… టీఆర్ఎస్ నేతలు తన వద్దకు రాయబారానికి వచ్చారని చెప్పారు. దీంతో.. అసలు క్లారిటీ వచ్చేసింది. ఆయన టీఆర్ఎస్, జగన్ కూటమి వైపు వెళ్లడం లేదని తేలిపోయింది. నిజానికి గతంలో పవన్ కల్యాణ్.. టీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడారు. ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలసి వచ్చారు. కేసీఆర్ గొప్పగా పరిపాలిస్తున్నారని కితాబులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు… పవన్ కల్యాణ్.. రాజకీయంగా తన విధానాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్‌తో టీఆర్ఎస్ కలవడంపై పవన్ అసంతృప్తి దేనికి..?
తెలంగాణ రాష్ట్ర సమితితో… జగన్ జట్టుకట్టడంపై … తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండి పడుతోంది. అయితే.. రాజకీయ విధానాలు అందరివీ ఒకలానే ఉండవు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ.. టీఆర్ఎస్తో పొత్తు కోసం ప్రయత్నించిందని చంద్రబాబే పలుమార్లు చెప్పారు. కేసీఆర్ అంగీకరించకపోవడం వల్ల.. కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు.. వైసీపీ.. టీఆర్ఎస్తో కలుస్తున్నందు వల్ల… దీనికి రివర్స్‌లో విమర్శలు చేస్తున్నారు. అందుకే.. రాజకీయ విధానాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఎవరు.. ఎవరితో కలుస్తారన్నది ఇప్పుడు ఊహించలేము. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్… జగన్‌తో కలిసే ప్రశ్న లేదని చెప్పారు. ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లుగా… చెప్పారు. కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తులుంటాయని స్పష్టంగా ప్రకటించారు కూడా.
ఇప్పటికిప్పుడు పవన్ ఆలోచనలేమిటి..?
అయితే.. అనుమానాలు ఎక్కడొస్తున్నాయంటే.. పవన్ కల్యాణ్ ఒకప్పుడు తానే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నారు. ఆ తర్వాత అలాంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం మానేశారు. తాను ఓ నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తానని భావించారు. కానీ.. రేపు నిర్ణయాత్మక శక్తిగా ఎదగలేనని.. భావించి.. కొన్ని సీట్లు కూడా రావేమోనని అనుకుని.. టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లయినా వస్తాయని ఆశ పడితే మాత్రం.. ఏ వైఖరి తీసుకుంటారో చెప్పలేము. ఇప్పటికైతే.. పవన్ కల్యాణ్… జగన్, చంద్రబాబులకు వ్యతిరేకంగా.. పని చేస్తామని.. ఎవరితోనూ కలిసి పోటీ చేసే ప్రశ్నే లేదని చెబుతున్నారు కాబట్టి.. అది నమ్మాలి. ఆయన విడిగా పోటీ చేయాలనే కోరుకుందాం. ఎందుకంటే.. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ప్రజలకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే అంత మంచిది.