సొంత పార్టీ ఎమ్మెల్యేలను జగన్.. తనను ఓడించేందుకు కంకణం కట్టుకున్న వర్గ శత్రువులుగా పరిగణిస్తున్నారు. పాలనలో అసలు ఎమ్మెల్యేల పాత్ర లేకుండా చేసి కనీసం వృద్ధాప్య పెన్షన్లు కూడా వాలంటీర్లతో పంపిణీ చేయిస్తూ.. ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేసిన ఆయన…తన పరపతి తరిగిపోవడానికి ఎమ్మెల్యేలే కారణమని గట్టిగా నమ్ముతున్నారు. పార్టీ కార్యక్రమాలు చేయడం లేదని.. గడప గడపకూ వెళ్లడం లేదని… ఎమ్మెల్యేలపై ప్రతీ సారి కారాలు.. మిరియాలు నూరుతున్నారు.
ఇప్పటికే రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో జగన్ చాలా ఘాటుగా మాట్లాడారు. నేరుగా పేర్లు పెట్టి చెప్పి అవమానకరంగా చూశారు. అయినా ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని స్థితి. మరోసారి ఆయన 14వ తేదీన ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల అధ్యక్షులు , సమన్వయకర్తలతో సమావేశం అవుతున్నారు. యాభై మంది ఎమ్మెల్యేలకూ జగన్ షాక్ ఇవ్వబోతున్నారని వారి పని తీరు ఏ మాత్రం బాగో లేదని తేల్చేశారని వైసీపీ వర్గాలు ఇప్పటికే మీడియాకు లీక్ చేశాయి.
నిజానికి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కువగా నమ్మడం లేదు. కేవలం ఓ వంద మంది ఉన్న ఐ ప్యాక్ టీమ్‌నే ఎక్కువగా నమ్ముతున్నారు. వారు చెప్పే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారుచేసే సర్వేల ఆధారంగానే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు. చివరికి ఏదైనా నియోజవకర్గ సమీక్ష పెడితే.. ఎవరెవర్ని ఆహ్వానించాలన్నది కూడా ఐ ప్యాక్ టీమే చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. కానీ… ఏమీ చేయలేని పరిస్థితి.
ఎన్నికలు జరిగేది.. జగన్ ను మరోసారి సీఎంగా చేయాలా వద్దా అన్న టాపిక్ పైనే. ఎమ్మెల్యేలపై నిందలేసి.. వారిదే తప్పని ముందుగానే చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.