గెలిచిన తర్వాత ప్రజలకు సేవచేసే సంగతేంటో కానీ, జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలు మాత్రం జనాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో జగన్ బహిరంగ సభ ఈరోజు మరొకరి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఆ మధ్య మండపేట, పిడుగురాళ్ల లో జగన్ జరిగిన సభలు జనాల ప్రాణాలతో చెలగాటమాడిన సంగతి తెలిసిందే. అదే కోవలో ఈరోజు కుప్పంలో జగన్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తిని బేట్రాయుడు అనే మాజీ సర్పంచ్ గా గుర్తించారు. తొక్కిసలాటలో స్పృహ కోల్పోయిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి నప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభ లు నిర్వహిస్తున్నప్పటికీ, అన్ని సభలలోనూ జనాలు విపరీతంగా పాల్గొంటున్నప్పటికీ, జగన్ సభలలో అపశృతులు ఎక్కువ జరుగుతుండడం గమనార్హం. అయితే దీనికి కారణం లేకపోలేదు. మిగతా పార్టీల సభలు చాలావరకు బహిరంగ మైదానాలలో జరుగుతుంటే, వైఎస్ఆర్ సీపీ మాత్రం ఇరుకు సందులో సభలు నిర్వహిస్తోంది. జనం ఎక్కువగా వస్తున్నట్లు చూపించు కోవటానికి వైఎస్ఆర్సిపి పడుతున్న ఆరాటం జనాల ప్రాణాలకు చెలగాటం గా మారుతోంది. మరో 4 రోజుల పాటు ఎన్నికల ప్రచారం కొనసాగనుండగా, కనీసం ఇప్పటికైనా వైఎస్ఆర్ సీపీ నేతలు తగు జాగ్రత్తలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.