అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగా హడావుడిగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .. పార్లమెంట్ ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. దాదాపుగా అరగంట పాటు చర్చలు జరిపారు. ఏం చర్చించారన్నదానిపై స్పష్టత లేదు కానీ.. మీడియాకు మాత్రం ఎప్పటిలాగే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది పాతదే. నాలుగేళ్ల నుంచి జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఇచ్చే ప్రెస్ నోటే. ఇందులో ఉన్న విషయాలేమీ ప్రధానితో భేటలో జగన్ అడగలేదని గతంలో.. ఓ ఆర్టీఐ దరఖాస్తుకు పీఎంవో సమాధానం కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఇదే ప్రెస్ నోట్‌ను విడుదల చేస్తూ ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు, కేంద్రం ఇస్తామన్న నిధులు, అదనపు రుణపరిమితి, పోలవరం నిధులు.. ఇలా అన్నింటినీఅడిగినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి మర్చిపోయారో మరో కారణమో కానీ.. ప్రత్యేక హోదా అడిగినట్లుగా చెప్పలేదు. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికితే ఆయనను కలిసి వెంటనే తాడేపల్లి పయనం అవుతున్నారు. అయితే… అసలు జగన్ ఢిల్లీకి వచ్చిన సీక్రెట్ ఏమిటో మాత్రం గుట్టుగానే వచ్చింది. జగన్ ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి ..ఎంపీ అవినాష్ రెడ్డి ఆయనతోనే ఉన్నారు.
ప్రధానితో భేటీకి వెళ్లే ముందు కూడా చర్చలు జరిపారు. అవినాష్ రెడ్డి విషయంలో సబీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోందని ప్రచారం జరుగుతున్న సమయంలో జగన్ ఇలా ప్రధానితో భేటీ కావడంతో.. ఇది కూడా వ్యక్తిగత విషయాల కోసం జరిగిన పర్యటనగా భావిస్తున్నారు. రాష్ట్రం కోసం ఆయన ఎప్పుడూ ఏమీ అడగలేదని.. కేంద్రం కూడా పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు.