హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మృతికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ వ్రాయడమే కారణమని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అది పిచుక మీద బ్రహ్మాస్త్రం సంధించడమేనని అన్నారు. మిగిలిన నలుగురు విద్యార్ధులపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని జగన్ డిమాండ్ చేసారు. లేఖ వ్రాసిన బండారు దత్తాత్రేయపై, దానిపై అతిగా స్పందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై, ఆమె ఆదేశాలకు అనుగుణంగా విద్యార్ధులను సస్పెండ్ చేసిన వైస్ చాన్సిలర్ అప్పారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేసారు.
చాలా మంది బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదేవిధంగా డిమాండ్ చేసారు. అయితే ఏనాడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి నేడు ఈవిధంగా మాట్లాడటం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ఉద్యమిస్తునప్పుడు కూడా ఆయన ఏనాడూ నేరుగా బీజేపీని కానీ కేంద్రప్రభుత్వాన్ని గానీ విమర్శించలేదు. అలాగే రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్, పోలవరం వంటి హామీలపై ఆయన ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీస్తుంటారు తప్ప వాటిని మంజూరు చేయవలసిన కేంద్రప్రభుత్వాన్ని ఏనాడు నిలదీయరు.
బహుశః భవిష్యత్ లో ఏదో ఒకరోజు బీజేపీ తెదేపాలు తెగతెంపులు చేసుకొన్నట్లయితే, అప్పుడు తాము బీజేపీతో జత కట్టాలనే ఉద్దేశ్యంతోనే ఆయన బీజేపీ, కేంద్రప్రభుత్వం పట్ల ఎన్నడూ మాట జారలేదు. కానీ ఇప్పుడు బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులే రోహిత్ మృతికి కారణమని నేరుగా వారిపేర్లు పెట్టి ఆరోపిస్తుండటమే కాకుండా వారిరువురిపై తక్షణమే చర్యలు (?) తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా తెదేపా,బీజేపీల బంధం నేటికీ అంతే పటిష్టంగా ఉండటంతో, ఇక బీజేపీ ఎన్నటికీ తమ పార్టీకి పొత్తులు కుదిరే అవకాశం లేదని భావిస్తున్నందునే జగన్మోహన్ రెడ్డి నేరుగా బీజేపీ మంత్రులను వేలెత్తి చూపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారేమో? అనే అనుమానం కలుగుతోంది.