రాజమండ్రి పుష్కరాలలో ఈరోజు ఉదయం జరిగిన త్రొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య 35 కి చేరుకొంది. ఇది ఎవరికయినా చాలా బాధ కలిగించే విషయమే. చంద్రబాబు వి.ఐ.పి.ఘాట్ లో పుష్కర స్నానం చేసి ఉంటే, ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదని జగన్ ఆరోపించారు. ప్రచారం కోసమే చంద్రబాబు సామాన్య ప్రజలు స్నానం చేసే కోటగుమ్మం ఘాట్ లో స్నానాలు చేసారని, ఆ కారణంగా రెండు గంటలపాటు అన్ని గేట్లు మూసివేయడంతో బయట క్యూ లైన్లలో విపరీతంగా జనాలు పెరిగిపోయారని, వారిలో ఎవరయినా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకొన్నా వీలులేకపోయిందని అన్నారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులు స్నానాలు ముగించుకొన్న తరువాత గేట్లు తీయగానే ఒక్కసారిగా త్రొక్కిసలాట మొదలవడంతో ముందు వరసల్లో ఉన్నవారు క్రిందనపడి మరణించారని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పుష్కరాల ఖ్యాతి మొత్తం తనకే దక్కాలనే యావతోనే చంద్రబాబు దేవాదాయ శాఖామంత్రి మాణిక్యరావుని సైతం పక్కనబెట్టి అన్నీ తానై నిర్వహించాలని చూసారని, కనుక ఈ అపకీర్తినీ ఆయనే స్వీకరించాలని, అదేవిధంగా మృతుల మరణానికి కూడా ఆయనే పూర్తి బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేసి కాశీ వెళ్లి గంగలో మునిగి తన తప్పులకు ప్రాయశ్చితం చేసుకోవాలని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను రాజకీయాలకు అతీతంగా చూసినట్లయితే చంద్రబాబు సామాన్య ప్రజలు స్నానాలు చేసే ఘాట్ లో స్నానం చేయడం, అందుకోసం ప్రజలను వేచి చూసేలా చేయడం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టం అవుతోంది. అందుకు చంద్రబాబు బాధ్యత వహిస్తారా లేదా? అనేది వేరే విషయం. కానీ గత నెల రోజులుగా ఆయన ఈ పుష్కరాలను చాలా గొప్పగా నిర్వహించాలని ఆయన చాలా తపన పడుతున్నారనే విషయం కూడా విస్మరించరాదు. ఒక కార్యక్రమాన్ని ప్రణాళికా బద్దంగా, నిర్విఘ్నంగా, దిగ్విజయంగా పూర్తి చేయాలని భావించడం కార్యసాధకుల లక్షణం. చంద్రబాబు నాయుడు కూడా అలాగే ఆలోచించి ఉండవచ్చును. ఆ ప్రయత్నంలో ఈ ఖ్యాతి అంతా తనకే దక్కాలని ఆయన అనుకొని ఉండవచ్చును. కానీ అదేమీ నేరం కాదు. కానీ ఆయన కీర్తిని కోరుకొన్నందుకు ఇటువంటి అపకీర్తి మూటగట్టుకోవలసివచ్చింది.
ఏ ముఖ్యమంత్రి కూడా తన ప్రజలు మరణిస్తే బాధపడకుండా ఉండలేరు. చంద్రబాబు నాయుడు కూడా చాలా బాధపడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఇటువంటి సంఘటన జరగడం ఆయనకి బాధ కలిగించింది. ఈ దుర్ఘటన మాయని మచ్చలా మిగిలిపోతుందని ఆయనకి కూడా తెలుసు. కానీ దుర్ఘటన జరిగిపోయిన తరువాత మళ్ళీ అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇద్దరూ కూడా తమ అభిమానులని ఈ పుష్కర సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే విధంగా రాజకీయ పార్టీలు వాటి అధినేతలు ఇటువంటి కీలక సమయంలో దీనిపై రాజకీయాలు చేసి ప్రజలలో మరింత ఆందోళన కలిగించే బదులు, తమ తమ పార్టీల నేతలని, కార్యకర్తలని ఈ పుష్కరాలు సజావుగా సాగేందుకు సహకరిస్తే అందరూ హర్షిస్తారు.