జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వేసిన స్టెప్కు షర్మిలకు మైండ్ బ్లాంక్ అయిపబోయిందని అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉందని.. వైసీపీని బలహీనం చేసి.. ఆ ప్లేస్ ను తాను క్యాప్చర్ చేస్తానని అనుకున్నారు., ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను పిలిచి జగన్ కాంగ్రెస్ దగ్గర అయితే ఏం చేద్దామని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. జగన్ మళ్లీ ఇండీ కూటమిలో చేరినా… కాంగ్రెస్ కు దగ్గరైనా షర్మిలకే ప్రాధాన్యమిస్తామని చెప్పి పంపించారని అప్పట్లో ప్రచారం జరిగింది.
Read Also: కూటమి కాదు.. షర్మిలే జగన్ టార్గెట్..!?
అందుకే షర్మిల ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సముద్రమని పిల్ల కాలువలన్నీ కాంగ్రెస్ లో చేరాల్సిందేనని ప్రకటించారు. ఎప్పటికైనా జగన్ కాంగ్రెస్ పంచన చేరాల్సిందేనని ఆమె అప్పట్లోనే తేల్చారు. జగన్ చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు షర్మిల ప్లాన్ బీ ఆలోచించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ ను బతికించాలని షర్మిల ఆ పార్టీలో చేరలేదు. రాజకీయ అనివార్యతల కారణంగానే చేరారు. రాజకీయంగా తాను సస్టెయిన్ కావాలంటే కాంగ్రెస్ అండ ఉండాల్సిందేననుకున్నారు. ఆమె రాజకీయాలపై దూకుడుగా ఉండటానికి కారణం జగనే. ఇప్పుడు ఆ జగనే మరోసారి ఆమెను నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ కు తాను దగ్గరవ్వాలంటే… షర్మిలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలన్నది జగన్ రెడ్డి మొదటి షరతుగా ఉంటుంది. ఎందుకంటే ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకుకు ఆమే ప్రధాన ముప్పు. ఈ విషయం గ్రహించనంత అమాయకురాలు కాదు షర్మిల. అందుకే జగన్ తప్పుడు కారణాలతో డిల్లీలో ధర్నా చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇండీ కూటమితో ఆయన ముందే ఒప్పందం చేసుకున్నారని కాస్త ఆలస్యంగా గ్రహించారు. ఇప్పుడు షర్మిల మరోసారి క్రాస్ రోడ్ లో నిలబడినట్లయింది. ఆమె తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.