ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లిపోవాలన్న ఆతృతలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఆయన అటు ఐ ప్యాక్, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు విని కాస్త నెమ్మదిగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్క సారిగా తిరగబడటంతో తాను ఎన్నికలకు వెళ్లి తీరాలని నిర్ణయించుకుని .. పరిస్థితుల్ని చక్కబెట్టుకునేందుకు సొంతంగా రంగంలోకి దిగినట్లుగా భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ వ్యవహారాలు ఎక్కువగా విజయసాయిరెడ్డి లేకపోతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చూసేవారు. కానీ ఇప్పుడు జగన్ సొంతంగా రంగంలోకి దిగి కేంద్రంతో మాట్లాడుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నానని జగన్ చెబితే… మీ ఇష్టం అని కేంద్ర పెద్దల నుంచి సమాధానం వచ్చిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మేరకు సానుకూలత రావడంతో మూడో తేదీన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తానని ఆయన సమాచారం పంపారు. ఢిల్లీలో ఉండగానే ఈ విషయాన్ని ఖరారు చేశారు. నిజానికి జగన్ ముందస్తు ఎన్నికలకు ఎప్పుడో రెడీ అయ్యారు. ఏడాది ముందు నుంచే గడప గడప పేరుతో పార్టీ నేతల్ని ఇంటింటికి పంపించారు. దానికి ప్రజాధనమే వెచ్చించారు. అయితే రాను రాను క్లిష్టంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా అనుకున్న విధంగా చేయలేక వ్యతిరేకత పెరుగుతోంది. ఇది అంతకంతకూ పెరిగే దే కానీ తగ్గేదే కాదని ఓ నిర్ణయానికి వచ్చి వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనకు జగన్ వచ్చారని అంటున్నారు.
సీఎం జగన్ ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే రెండు, మూడు నెలల్లో ఎన్నికలు పెడతారా అంటే చెప్పడం కష్టమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి. మే వరకూ ఈ హడావుడి ఉంటుంది. అప్పటి వరకూ ఎలాంటి ఎన్నికలు పెట్టరు. ఒక వేళ అసెంబ్లీని రద్దు చేస్తే ఆ తర్వాత కసరత్తు చేస్తారు. ఆరు నెలల్లోపు ఎన్నికలు పెట్టాలనేది రూల్. అయితే ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తే.. . బీజేపీ అనుకుంటే రాష్ట్రపతి పాలన కూడా విధించవచ్చు. కానీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి అలాంటి పరిస్థితి రాదంటున్నారు.
కారణం ఏదైనా జగన్ చేయాలనుకుంటే వెంటనే చేసేస్తారని లేకపోతే ఉండలేరని వైసీపీ వర్గాలంటున్నాయి. ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఆయన ఆగరని భావిస్తున్నారు.