జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ ఎదురీదుతోంది. పరిస్థితులు పూర్తిగా తలకిందులు అవుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కడపలో సత్తా చాటిన కూటమి.. ఇప్పుడు జడ్పీ పీఠంపై కన్నేసింది. దీంతో జగన్ రెడ్డి జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు.. వారిని బుజ్జగించారు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ మేనమామను నియమించారు.
ఇదివరకు కడప వ్యవహారాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకునేవారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆందోళనతో అవినాష్ రెడ్డి యాక్టివ్ గా ఉండటం లేదు. జిల్లాలో పెద్దగా పర్యటనలు కూడా చేపట్టడం లేదు. అసలే పార్టీ కష్టకాలంలో ఉన్న వేళ జగన్ తో సహా అవినాష్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజా ప్రతినిధులు గుర్రుగా ఉన్నారు.
Also Read : జగన్ పై ఎమ్మెల్యేల తిరుగుబాటు!?
దీంతో కడప జిల్లా పార్టీ పగ్గాలను తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. ఆయనే ఇక మీకు అందుబాటులో ఉంటారని జగన్ వెల్లడించారు. మరోవైపు రవీంద్రనాథ్ రెడ్డి నియామకం వెనక స్ట్రాటజీ కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే షర్మిలకు విజయమ్మ సపోర్ట్ చేస్తోందని, త్వరలోనే వైఎస్ కుటుంబీకుల్లో చాలామంది షర్మిలకు జై కొడుతారని ప్రచారం జరుగుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని మేనమామకు కడప జిల్లా పార్టీ బాధ్యతలను జగన్ అప్పగించారని అంటున్నారు.
మరోవైపు షర్మిలను ఎదుర్కొనే విషయంలో కుటుంబం నుంచి కూడా జగన్ కు మద్దతు లభించడం లేదు. స్వయంగా ఆమెపై విమర్శలు చేసేందుకు జగన్ సాహసించడం లేదు. షర్మిలపై విమర్శలు చేస్తే ఆమెకు మరింత హైప్ ఇచ్చినట్లు అవుతుందని సైలెంట్ గా ఉంటున్నారు. అదే సమయంలో షర్మిల విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోతే జగన్ కు వ్యక్తిగతంగా ఇబ్బంది అవుతుందని.. అందుకే తన మేనమామకు మొదటిసారిగా పార్టీ పగ్గాలు జగన్ అప్పగించారని అంటున్నారు.